టోల్ చార్జీల భారం తగ్గించాలి : సీపీఐ(ఎం)

నవతెలంగాణ హైదరాబాద్:  నేటి నుండి దేశ వ్యాపితంగా జాతీయ రహదారుల టోల్‌ టాక్స్‌ రేట్లను సగటున 5శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెంపుదలను వాయిదా వేసిన కేంద్రం, పోలింగ్‌ ముగియగానే పెంచడం ప్రయాణీకులపై తీవ్ర భారాన్ని మోపడమే. వివిధ రకాల వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించి హైదరాబాదు చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డులో టోల్‌ ఛార్జీలను 5శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ సంస్థ ప్రకటించింది. ఈ పెంపుదల రు.5 నుండి రు.50ల వరకు పెరుగుతుంది. ఈ ఛార్జీలు ప్రజలకు భారం కానున్నాయని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. తక్షణమే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నది. ప్రతియేటా టోల్‌ రుసుం పెంచి వాహనదారులపై భారం మోపడం సరైందికాదు. టోల్‌గేట్ల వద్ద మంచినీరు, వాష్‌రూమ్స్‌ తదితర కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు, గ్రామాలకు ఇరువైపుల సర్వీసు రోడ్లు కూడా వెయ్యలేదు. చాలా సందర్భాల్లో టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రించడంలో విఫలమవుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఈ పెంపుదల సామాన్యుల నడ్డి విరిచి, టోల్‌గేట్‌ సంస్థల యజమానులకు దోచిపెట్టడమే.

Spread the love