– 29న బెల్లంపల్లిలో ప్రారంభించనున్న తమ్మినేని
– ఆగస్టు 5న కొత్తగూడెంలో ముగింపు సభ
– బొగ్గుబ్లాకులను సింగరేణికి కేటాయించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
– ప్రయివేటీకరించబోమంటూ కిషన్‌రెడ్డి తప్పుడు ప్రచారం
– వేలం పాటను ఆపాలంటూ కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్
– బస్సుయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి నేరుగా కేటాయించాలనీ, వేలం పాటను ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి సింగరేణి పరిరక్షణ యాత్రను చేపడుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య చెప్పారు. అదేరోజు ఉదయం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం యాత్రను ప్రారంభిస్తారని అన్నారు. వచ్చేనెల ఐదో తేదీ వరకు ఎనిమిది రోజులపాటు ఈ బస్సుయాత్ర కొనసాగుతుందనీ, కొత్తగూడెంలో ముగింపు సభ ఉంటుందని వివరించారు. ఈ యాత్రకు తాను నాయకత్వం వహిస్తాననీ, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, పి ఆశయ్య సభ్యులుగా ఉంటారని చెప్పారు. సింగరేణి పరిరక్షణ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలంపాట నిర్వహిస్తున్నదని చెప్పారు. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దాన్ని ప్రారంభించారని అన్నారు. బొగ్గు గనుల తవ్వకాల కోసమే సింగరేణి సంస్థ ఏర్పడిందని గుర్తు చేశారు. చౌకగా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే బొగ్గును ఇస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వనరులను సమకూరుస్తున్నదని వివరించారు. సింగరేణి సంస్థను నీరుగార్చి, దాన్ని దెబ్బతీసేలా బొగ్గుబ్లాకులను వేలంపాటను నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రయివేటు సంస్థలకు బొగ్గుబ్లాకులను కేటాయిస్తే సింగరేణి నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రావణపల్లి బొగ్గు బ్లాకును నేరుగా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రెండు బొగ్గుబ్లాకులను ప్రయివేటువారికి అప్పగించారని చెప్పారు. కార్మికులను, ప్రజలను చైతన్యవంతం చేయడానికే సింగరేణి పరిరక్షణ యాత్రను చేపడుతున్నామని వివరించారు.
సింగరేణి ప్రయివేటీకరణ దిశగా ప్రభుత్వాల నిర్ణయాలు
తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉండడం వల్ల సింగరేణిని కాపాడుకోవడం సులభమని అందరూ భావిస్తారని వీరయ్య అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నారని చెప్పారు. వారంతా ప్రజల ఆశలను అడియాశలు చేశారని విమర్శించారు. మోడీని మోయడానికే ఉన్నారు తప్ప ఓట్లేసిన ప్రజల ప్రయోజనాలను కాపాడ్డం లేదన్నారు. సింగరేణిని ప్రయివేటీకరించబోమంటూ కిషన్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. కేంద్రానికి 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉందన్నారు. కానీ కేంద్రం ఏకపక్షంగా సింగరేణికి బొగ్గు బ్లాకులను కేటాయించకుండా ప్రయివేటు వారికి అప్పగించేందుకు వేలం పాటను నిర్వహిస్తున్నదని వివరించారు. దాని వల్ల సింగరేణి నస్టాలబాట పడుతుందనీ, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి దాపురిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా అలాగే ఉన్నా సింగరేణి సంస్థ మూతపడుతుందని వివరించారు. ఆ సంస్థ నడవాలంటే ప్రయివేటు సంస్థలకు అప్పగించాలంటూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. సింగరేణి ప్రయివేటుపరం అవుతుందనీ, కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాట చరిత్ర ఉన్న తెలంగాణ ప్రజలు, కార్మికులు కన్నెర్రజేసి సింగరేణిని కాపాడుకోవాలని కోరారు. శ్రావణపల్లి బొగ్గుబ్లాకును సింగరేణికి కేటాయించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరుతున్నారని చెప్పారు. ఇంకోవైపు వేలంపాటలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంటున్నదనీ, సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారని గుర్తు చేశారు. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదనీ, వేలంపాటలో పాల్గొనడం నేరమని విమర్శించారు. ఈ తప్పును రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలని సూచించారు. వేలంపాటను రద్దు చేయాలనీ, శ్రావణపల్లి బొగ్గుబ్లాకును సింగరేణికే కేటాయించాలంటూ కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.