– భవిష్యత్తులో ఎర్రజెండా పార్టీలదే రాజ్యాధికారం
– దుబ్బాకలో ఘనంగా సీపీఐ(ఎం) 4 వ మండల మహాసభలు
నవతెలంగాణ -దుబ్బాక : ప్రజా రైతు కార్మిక సమస్యలే సీపీఐ(ఎం) ఎజెండా అని.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా,కార్మిక,రైతు,కూలీల వ్యతిరేక విధానాలపై అనునిత్యం పోరాడే ఏకైక పార్టీ సీపీఐ(ఎం) మాత్రమేనని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి స్పష్టం చేశారు.భవిష్యత్తులో ఇండియాలో ఎర్ర జెండా పార్టీలే రాజ్యాధికారం చేపడతాయని నొక్కి చెప్పారు.దుబ్బాక పట్టణ కేంద్రంలోని “పట్టణ స్వర్ణకారుల భవనం”లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్) సీపీఐ(ఎం) “దుబ్బాక మండల 4 వ మహాసభ” లకు జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనారు.ముందుగా ఆయన సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు.ఆ తర్వాత జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్ అమరుల త్యాగాలను కీర్తిస్తూ పాట పాడగా… అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.అనంతరం కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి స్మరించుకున్నారు.ఆ తర్వాత ఇటీవలే మరణించిన పార్టీ నాయకులకు 2 నిముషాల మౌనం పాటించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడారు.సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లో ఈ మహాసభలను ఈ నెలాఖరులోగా జరుపుతామని తెలిపారు.అలాగే డిసెంబర్ 1,2 తేదీల్లో గజ్వేల్ పట్టణంలో జరిగే సీపీఐ(ఎం) జిల్లా మహాసభలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు హాజరవుతున్నట్లు వెల్లడించారు.దుబ్బాక పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి జిల్లా మహాసభలకు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దుబ్బాక ప్రాంతంలో గత మూడేళ్లుగా రైతులు,హమాలీ,పేద ప్రజలు,బీడీ కార్మికుల సమస్యల్ని సీపీఐ(ఎం) పరిష్కరించిందన్నారు.ఈ మూడేళ్ల పని తీరును సమీక్షించుకుని రాబోవు రోజుల్లో చేయాల్సిన కర్తవ్యాలు,విధివిధానాలపై సమాలోచనలు చేయడం జరిగిందన్నారు.భవిష్యత్తులో దుబ్బాక ప్రాంతంలోని ప్రతి గ్రామాన సీపీఐ(ఎం) పార్టీని విస్తరింప చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రాంతంలో బీడీ కార్మికులు,అంగన్వాడీ,ఆశా వర్కర్లు,సంఘటిత,అసంఘటిత,బిల్డిం గ్ వర్కర్ల శ్రేయస్సుకోసం పోరాడిన ఏకైక పార్టీ సీపీఐ(ఎం) మాత్రమేనని నొక్కి చెప్పారు. భవిష్యత్తు పోరాటాలకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీ.భాస్కర్ మాట్లాడుతూ,సీపీఐ(ఎం) 4 వ మండల మహాసభలను దుబ్బాకలో విజయవంతంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు.దుబ్బాక ప్రాంతంలో ప్రజా,కార్మిక,రైతు,హమాలి,బీడి కార్మికుల సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్న ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అని స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితుల పట్ల కొట్లాడింది.. బీడి కార్మికులకు జీవన భృతి ఇప్పించింది సీపీఐ(ఎం) మాత్రమే అని గుర్తు చేశారు.
ఈ మహాసభలలో సీపీఐ(ఎం)
జిల్లా కమిటీ సభ్యులు దాసరి ప్రశాంత్,సింగిరెడ్డి నవీన,మండల నాయకులు కొంపెల్లి భాస్కర్, మల్లేశం, లక్ష్మీనర్సయ్ య, సాదిక్, రాజు, సాజిద్, రమేష్, ప్రశాంత్, మహేష్, వాని, భాగ్యమ్మ, సతమ్మ, పలు గ్రామాల పార్టీ సభ్యులు,సానుభూతిపరులు పాల్గొన్నారు.