కర్ణాటక ఫలితాలతో దక్షిణాదిలో బీజేపీకి గేట్లు మూసుకుపోయాయి

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక ఫలితాలతో దక్షిణాదిలో బీజేపీకి గేట్లు మూసుకుపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కర్ణాటక తీర్పుతోనైనా ఆయా పార్టీల్లో మార్పు రావాలని సూచించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్‌ పార్టీతోనైనా జతకట్టడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.  కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాజకీయ పరిణామాలు మారాయని పేర్కొన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, అమిత్‌ షా నాయకత్వం వహించినా బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. కన్నడనాట 212 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు మద్దతిచ్చారని తెలిపారు.

Spread the love