– పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
– విద్య ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణకు కేంద్రం ఆజ్యం : రైతు నాయకులు, ఎంపీ అమ్రారామ్
– అట్టహాసంగా ఎస్టీఎఫ్‌ఐ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పార్లమెంటు సభ్యులు, ప్రముఖ రైతు నాయకులు అమ్రారామ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీ శివారు ఫరీదాబాద్‌లో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) కేంద్ర కార్యాలయం ‘టీచర్స్ భవన్’ను ప్రారంభించారు. అనంతరం ఎస్టీఎఫ్‌ఐ అధ్యక్షులు హరిక్రిష్ణన్ అధ్యక్షతన నిర్వహించిన విద్యా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్టీఎఫ్‌ఐ ఏర్పడి 25 ఏండ్లైన సందర్భంగా రజతోత్సవ వేళ నూతన భవనం ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ భవనం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే పోరాటాలకు కేంద్రంగా మారాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో మోడీ నినాదం ”సబ్ కా వికాస్” కేవలం దేశంలోని ఇద్దరి వికాసానికి మాత్రమే దోహదపడిందని ఎద్దేవా చేశారు .కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేయడం తప్ప, రైతులు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, మహిళలు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాదన్నారు. ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిన సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఈపీ-2020 పేరుతో విద్యా విధానాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. దీనిని ప్రతిఘటించేందుకు ఎస్టీఎఫ్‌ఐ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. చాలా రాష్ట్రాల్లో వేలాది పాఠశాలలు మూతపడుతున్నాయని గుర్తు చేశారు. రెగ్యులర్ నియామకాలు తగ్గించి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తూ, వారికి కనీస వేతనాలు ఇవ్వటం లేదని దుయ్యబట్టారు.
రాజ్యాంగం నిర్ధేశించిన స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, సామాజిక న్యాయం గురించి విద్యార్థులకు బోధించాలన్నారు. ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల రక్షణ కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ విద్యా వేత్త, జాయింట్ ఫోరం ఫర్ మూవ్‌మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ (జెఎఫ్‌ఎంఈ) సమన్వయకర్త డి.ఎస్. లోబియాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యకు దూరమవుతున్న 6.2 కోట్ల మంది బడిఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు ఎటువంటి కృషీ చేయడం లేదన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని, ఈ దేశంలోని చాలా రాష్ట్రాల్లో సగం పాఠశాలల్లో సగటున 10 మంది విద్యార్థుల కంటే తక్కువ నమోదు ఉండడం ఇందుకు ఉదాహరణ అని వివరించారు.
జెఎఫ్‌ఎంఈ చైర్ పర్సన్ నందిత నారాయణన్ మాట్లాడుతూ విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలన్నారు. దూరవిద్య, ఆన్‌లైన్ విద్యలు సరైన విద్యా విధానం కాదన్నారు. విద్యారంగంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థలు పెరగడం మంచి పరిణామం కాదన్నారు. విద్యారంగం మొత్తాన్ని డిజిటలీకరణ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆన్‌లైన్ పద్ధతిలో విద్యాబోధన కార్పొరేట్ పాఠశాలలకు ఉపయోగం తప్ప, గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకు అందని ద్రాక్షగా ఉందన్నారు. అటువంటి వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు పోరాటం చేయాలన్నారు. ప్రత్యక్ష విద్యాబోధన విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపకుల మధ్య అవినాభావ సంబంధం బలోపేతానికి ఉపయోగపడుతుందన్నారు. ఉపాధ్యాయులతో స్పూర్తి పొంది వారి జీవితాన్ని తీర్చి దిద్దుకునే అవకాశాన్ని ఆన్‌లైన్, దూర విద్య ద్వారా పొందలేరని వివరించారు.
విద్యా రంగ పునర్నిర్మాణం కోసం ఐక్య ఉద్యమాలు : మయూక్ బిశ్వాస్
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయాంక్ బిశ్వాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 34 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, 44 శాతం పాఠశాలల్లో విద్యుదీకరణ జరగలేదని వివరించారు. విద్యకు జీడీపీలో ఆరు శాతం నిధులను కేటాయించడానికి ఉద్యమించాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వేలాది పాఠశాలలు మూతపడ్డాయన్నారు. విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతాలేమిగా ఉందన్నారు. కనీసం గుడ్డు కూడా పెట్టడం లేదని, దీని వల్ల సమతుల ఆహారం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇటువంటి వారిని ప్రోత్సహించడం సరి కాదన్నారు. విద్యా రంగ పునర్నిర్మాణం కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ మౌషుమి బసు, ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యవతి, కార్యదర్శి ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్‌లు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా కేంద్రం మూఢనమ్మకాలను విస్తృతంగా ప్రచారం చేస్తోందన్నారు. ఎన్‌ఈపీ- 2020 విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విధంగా లేదని విమర్శించారు. విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. లింగ సమానత్వం సాధించే పోరాటంలో, మహిళలు ముందుండాలన్నారు.
ఎప్టీఎఫ్‌ఐ నూతన భవన ప్రారంభోత్సవం, విద్యాసదస్సులో ఎప్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.ఎన్. భారతి, తెలంగాణ ఉపాధ్యక్షులు చావా రవి, ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, అరుణకుమారి, కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్, రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజి శ్రీనివాసరావు, సహాధ్యక్షులు కె సురేష్ కుమార్, కుసుమ కుమారి, నాయకులు లక్ష్మీ రాజా, గోపీమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్. దుర్గా భవాని, ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సభ్యులు కె. జంగయ్య, వైద్య శాంతి కుమారి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.