ఏపీలో అంగన్‌వాడీలపై కర్కశం

Crackdown on Anganwadis in AP– పలు జిల్లాల్లో అరెస్టులు, ఉద్రిక్తత అక్కడికక్కడ అడ్దగింతలు నిర్బంధాన్ని అధిగమించి
– కలెక్టరేట్ల వద్ద అంగన్‌వాడీల బైటాయింపు
విజయవాడ : అంగన్‌వాడీలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. కలెక్టరేట్ల బైఠాయింపు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి నిర్బంధాన్ని ప్రయోగించారు. పలు జిల్లాల్లో అరెస్టులకు పాల్పడ్డారు. బస్సుల్లో వెళ్తున్న అంగన్‌వాడీలను బలవంతంగా దించేశారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నిర్బంధాన్ని అధిగమించి కలెక్టరేట్ల వద్దకు చేరుకొని వేలాది మంది అంగన్‌వాడీలు బుధవారం బైఠాయించారు. నిర్బంధాలకు, బెదిరింపులకు భయపడేది లేదని, తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. వారి నినాదాలతో కలెక్టరేట్లు హోరెత్తాయి.
విజయవాడలో వి.శ్రీనివాసరావు సహా పలువురు అరెస్టు
విజయవాడలో పోలీసులు సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సహా పలువురిని అరెస్టు చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలోని అన్ని మండలాల నుంచి విజయవాడ కలెక్టరేట్‌కు వస్తున్న అంగన్‌వాడీలపై పోలీసులు విరుకుపడి బీభత్సం సృష్టించారు. నాలుగు ప్రాంతాల్లో సుమారు వెయ్యి మందిని బలవంతంగా అరెస్టు చేసి ఎంజి రోడ్డులోని ఎఆర్‌ గ్రౌండ్స్‌, మాచవరం పోలీస్‌ స్టేషన్‌, హనుమాన్‌పేటలోని శ్రీరాజరాజేశ్వరి కళావేదిక కల్యాణ ప్రాంతాలకు తరలించారు. అరెస్టుల సందర్భంగా పోలీసులు కర్కశంగా వ్యవహరించడంతో ఎల్‌.రమాదేవి సహా పలువురు అంగన్‌వాడీలకు తీవ్ర గాయాలయ్యాయి. అంగన్‌వాడీలతో కలిసి ర్యాలీలో వస్తున్న సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావును బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేతికి తీవ్ర గాయమైంది. అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మను అరెస్టు చేశారు. యూనియన్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.సిహెచ్‌.సుప్రజను వెంటపడి మరీ పట్టుకుని పోలీసులు గొంతు నొక్కేయడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్వరాజ్యం మైదానం వద్ద సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఏపీ నాయకులను పోలీసులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత వారందరినీ పోలీసులు విడుదల చేశారు.
రేపటి నుంచి విజయవాడలో 24 గంటల రిలేదీక్షలు
శుక్రవారం(ఐదవ తేది) నుండి విజయవాడలో 24 గంటల రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఏపీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బైఠాయింపు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అంగన్‌వాడీలకు అభినందనలు తెలిపారు. గురువారం ఆందోళనలను యథావిధిగా కొనసాగించాలని కోరారు.
శుక్రవారం విజయవాడలో చేపట్టనున్న రిలే నిరాహార దీక్షలను యూనియన్‌ అఖిలభారత కార్యదర్శి ఎ.ఆర్‌ సింధు ప్రారంభిస్తారని తెలిపారు. శనివారం (ఆరవ తేది) అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద 24 గంటల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని, అదే సమయంలో ప్రస్తుతం ఎక్కడికక్కడ జరుగుతున్న ఆందోళనలను కొనసాగించాలని అంగన్‌వాడీలకు పిలుపునిచ్చారు.

Spread the love