ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్లకు క్రీమీలేయర్‌ వర్తించదు

– బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ భరోసా
న్యూఢిల్లీ: ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్‌ సూత్రం వర్తించదని బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం హామీ ఇచ్చారు. బీజేపీలోని ఎస్‌సీ, ఎస్‌టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు శుక్రవారం పార్లమెంట్‌ హౌస్‌లో మోడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని వద్ద ఇటీవల నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు చేసిన సూచనను ఎంపీలు ప్రస్తావించారు. ఎస్‌సీల్లో వర్గీకరణ విచారణ సందర్భంగా ఏడుగురు జడ్జీలు ఉన్న విస్తృత ధర్మాసనంలో నలుగురు జడ్జీలు ఎస్‌సీ ఎస్‌టీ రిజర్వేషన్లలోనూ క్రీమీ లేయర్‌ సూత్రాన్ని వర్తింపచేయాలని సూచించిన సంగతి తెలిసిందే. దీన్ని ఎంపీలు ప్రధాని వద్ద ప్రస్తావించగా మోడీ స్పందిస్తూ ఇది కేవలం ఒక పరిశీలన మాత్రమే అని ెప్పారు. ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్‌ను వర్తింపచేయమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సమావేశం అనంతరం కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే ఎక్స్‌ పోస్టు ద్వారా తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజూ, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. కాగా, ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో మంత్రి మేఘావాల్‌ కూడా వెల్లడించారు. ఎస్‌సీ, ఎస్‌టీల్లో క్రీమీలేయర్‌ అనేది సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల పరిశీలన మాత్రమేనని, ఈ విషయంలో ప్రజల్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించవద్దని కోరారు.

Spread the love