– ఆయా గ్రామాలను సరిహద్దు జిల్లా, మండలాల్లోకి మార్పు
– ఉత్తర్వులు జారీచేసిన రెవెన్యూశాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మండలాల తో పాటు పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి దృష్ట్యా కొన్ని గ్రామాలను సరిహద్దు మండలాలతోపాటు జిల్లాల్లోకి కూడా మార్చారు. మార్పులు, చేర్పులు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కొత్త మండలాల ఏర్పాటు, గ్రామాల మార్పునకు సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15రోజుల్లో తెలియజేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాల పల్లి డివిజన్ చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం, కల్వపల్లే గ్రామాలతోపాటు పెద్దపల్లి జిల్లాలోని మంథని డివిజన్ ముత్తారం మండలంలోని శాంతరాజుపల్లిని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన టేకుమట్ల మండలంలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదే జిల్లాలో కొత్తపల్లిగోరి అనే కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న రేగొండ మండలంలోని కొత్తపల్లిగోరి, చెన్న పూర్, చెన్నకొడేపాక, జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్, జంషెడ్‌బేగ్‌పేట్, కొనరావుపేట్ గ్రామాలను కొత్తపల్లిగోరి మండలానికి కేటాయించింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా ఇర్విన్ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న మాడ్గుల మండలం లోని ఇర్విన్, బ్రాహ్మణపల్లి, ఆర్కపల్లి, అందుగుల, అన్నేబోయినపల్లి, సుద్ధపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణంపల్లి గ్రామాలను ఇర్విన్ మండలానికి కేటాయించింది.
హన్మకొండ జిల్లాలోని వేలేర్ మండలంలోని కన్నారం, ఎర్రబెల్లి గ్రామాలను అభివృద్ధి దృష్ట్యా వేర్వేరు జిల్లాల్లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని అక్కన్నపేట మండలంలోకి మార్చనుంది. ఎర్రబెల్లి గ్రామాన్ని హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలోకి మార్చనుంది.