– విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి
– ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రికి ఎస్‌ఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రయివేట్ విశ్వవిద్యాలయాలుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయకుండా, అనుమతులు రాకుండానే విద్యార్థులను చేర్పించుకుని వారి జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్, శ్రీనిధి వర్శీటీల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రిని శనివారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గురునానక్, శ్రీనిధి కళాశాలలకు ప్రయివేటు విశ్వవిద్యాలయం అనుమతి రాకముందే అడ్మిషన్లు చేసి, విస్తృతంగా ప్రచారం చేసి వేలాది మంది విద్యార్థులను చేర్చుకున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రవేశాలు చేపట్టకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అనుమతి రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోయామంటూ ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే ఈ అంశంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోకుండా చదువులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌కు అనుబంధంగా ఉన్న కాలేజీల్లోనైనా విద్యార్థులను చేర్పించాలని కోరారు. వారు కట్టిన ఫీజులను వెనక్కి ఇవ్వాలని తెలిపారు. లేదంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి శంకర్, ఆర్ సంతోష్, సహాయ కార్యదర్శి కె అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు బి వెంకట్, నాయకులు లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి : పీడీఎస్‌యూ
అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపట్టిన గురునానక్, శ్రీనిధి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం, ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజరుకన్నా డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఎందుకు అనుమతి లేదంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరించడం, అక్రమంగా అరెస్టు చేయించడం దారుణమని తెలిపారు. వాటిపై చర్యలు తీసుకోకుండా నోటీసులిచ్చి చేతులు దులుపేసుకోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థులకు న్యాయం చేయకుంటే ఆందోళనా కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.