మోడీ మంత్రి వర్గంలో నేరచరితులు..

– 28మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు
– అత్యంత సంపన్నుడిగా పెమ్మసాని
న్యూఢిల్లీ : కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన మోడీ మంత్రివర్గంలో 28 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. ఇందులో 19 మంది హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగాలు.. వంటి తీమ్రైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలను ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. ఇద్దరు మంత్రులు ఐపీసీ సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం ఆరోపణలున్నాయి. నౌకాశ్రయాలు, షిప్పింగ్‌, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్‌, విద్యా శాఖ, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుకంత మజుందర్‌పై ఈ కేసులున్నాయి. హోం శాఖ సహాయ మంత్రి బండి సంజరుకుమార్‌, ఠాకూర్‌, మజుందర్‌, పెట్రోలియం, సహజవాయువులు, టూరిజం శాఖ సహాయ మంత్రి సురేష్‌ గోపి, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జౌల్‌ ఓరంలు మహిళలపై వేధింపుల కేసులు ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మంది మంత్రులపై విద్వేష ప్రసంగాల కేసులున్నాయని ఏడీఆర్‌ తెలిపింది. మొత్తం 71 మంత్రుల్లో 28 మంది (39 శాతం)పై క్రిమినల్‌ కేసులున్నాయని వెల్లడించింది.
99 శాతం కేంద్ర మంత్రులు కోటీశ్వరులు
ప్రధాని మోడీ కొత్త మంత్రివర్గంలోని 71 మంది మంత్రుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులే ఉన్నారు. 71 మంది మంత్రుల సగటు ఆస్తులు రూ.107.94 కోట్లు. ఆరుగురు మంత్రులకు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మోడీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో బీజేపీ నుంచి 61 మంది, ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి 11 మంది మంత్రులు ఉన్నారు. 72 మంది మంత్రుల్లో 43 మంది మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 39 మంది గతంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.
పెమ్మసానే సంపన్నుడు
మోడీ మంత్రివర్గంలో అత్యంత ధనిక మంత్రిగా టీడీపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌ నిలిచారు. ఆయనను గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిగా నియమించారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రెండో స్థానం, మూడో స్థానంలో ఉన్న హెచ్‌ డి కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అశ్వని వైష్ణవ్‌ రైల్వే, ఐ అండ్‌ బీ, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్న పీయూష్‌ గోయల్‌ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ మంత్రుల ఆస్తులను ఏడీఆర్‌ లెక్కించింది.
71 మంది కేంద్ర మంత్రుల్లో 47 (66 శాతం) మంది కొత్తవారు కాగా, వారి వయస్సు 51-71 మధ్య ఉంది. 11 మంది ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించగా, 57 మంది గ్రాడ్యుయేషన్‌, ఆపై చదివారు.

Spread the love