– గణనీయంగా పడిపోతున్న విద్యార్థుల సంఖ్య
– అధ్యాపకులు, సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యం
– మూత పడుతున్న కాలేజీలు
న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ జర్నలిజం కళాశాలల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఓ వైపు ఫీజులు పెరిగిపోతుంటే అధ్యాపకుల జీతాలు మాత్రం అలాగే ఉంటున్నాయి. మరోపక్క విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోతోంది. బెంగళూరులోని ఓ ప్రముఖ జర్నలిజం కాలేజీలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో 2020లో 18 మంది విద్యార్థులు చేరగా 2021లో 19 మంది చేరారు. 2022లో ఆ కాలేజీలో చేరింది తొమ్మిది మంది మాత్రమే. దీంతో అధ్యాపకులు, సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యం జరిగింది. గెస్ట్ లెక్చరర్లతో కాలక్షేపం చేశారు. యాజమాన్యం కొన్ని స్వల్ప కాలిక కోర్సులు ప్రవేశపెట్టినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. చివరికి 2001లో ప్రారంభమైన ఈ కాలేజీని గత నెలలో మూసేశారు.
దేశంలోని పలు ప్రయివేటు జర్నలిజం స్కూళ్లు, కళాశాలల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దేశంలోని ఐదు ప్రముఖ సంస్థల్లో గత ఐదేండ్లలో ప్రవేశాలు 15 నుండి 40 శాతం పడిపోయాయి. ఈ సంవత్సరం సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో 10-20 శాతం, నేషనల్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో 15 శాతం, స్కావియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో 20 శాతం, మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో 30-40 శాతం మేర ప్రవేశాలు తగ్గిపోయాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన బెన్నెట్ యూనివర్సిటీ పీజీడీ ప్రోగ్రామ్‌లను నిలిపివేసింది. ప్రధాన స్రవంతి మీడియాపై విశ్వసనీయత తగ్గిపోవడం, అధిక ఫీజులు, తక్కువ వేతనాలు వంటివి ఈ పరిస్థితికి కారణమని డీన్లు, మీడియా నిపుణులు, విద్యార్థులు తెలిపారు.