నవతెలంగాణ – హైదరాబాద్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి సంబంధించిన చెక్ డ్యామ్‌లో మొసలి సంచారం కలకలం రేపింది. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈనెల 17న సాయంకాలం అదే ప్రాంతంలో ఉన్న రైతులు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.మొసలి సంచారం చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు.అదే రోడ్డు మార్గంలో రైతులు, గొర్రెల కాపరులు నిత్యం తిరుగుతుండటం, అటు వైపు వెళ్లాల్సి వస్తే ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.’ మండల కేంద్రంతో పాటు ఓబులాపూర్‌కు శివారులో ఉన్న చిన్నవాగుపై కొన్నాళ్ల కిందట చెక్ డ్యామ్ నిర్మించారు.ఇటీవల కురిసిన భారీ వరదలకు చెక్ డ్యాం ద్వారా సంఘం బండ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరింది. ఈ క్రమంలోనే భారీ వరద నీటి ప్రవాహానికి మొసలి వచ్చి చెక్ డ్యామ్‌లో చేరి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇదిలాఉండగా, నేటికీ మండల కేంద్రంలోని పెద్ద చెరువు అలుగు పారడంతో చెక్ డ్యామ్ ద్వారా నీరు దిగువకు పారుతోంది. ఇప్పట్లో నీరు కిందకు వదిలేందుకు అవకాశం లేదని సమాచారం.జిల్లా ఫారెస్ట్ అధికారులు స్పందించి మొసలిని వేరే ప్రాంతానికి తరలించాలని ఆ ప్రాంతం రైతులు,గొర్రెల కాపరులు కోరుతున్నారు.