టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్

నవతెలంగాణ – హైదరాబాద్
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.1.63 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు విచారణలో వెల్లడైందని, అలాగే నిందితుల ఖాతా వివరాలు, చేతులు మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశామని, మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 49 మందిని అరెస్ట్ చేయగా, ఇందులో 16 మంది మీడియేటర్లుగా ఉన్నట్లు దర్యాఫ్తులో వెల్లడైందని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన ప్రశాంత్, మరో నిందితుడు న్యూజిలాండ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏఈఈ ప్రశ్నాపత్రం లీకైన తర్వాత 13 మందికి, డీఏవో పేపర్ లీకైన తర్వాత 8 మందికి, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నలుగురికి చేరినట్లు పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చేరిన నలుగురిలో ముగ్గురు టీఎస్‌పీఎస్సీలో పని చేసే ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. డీఈ రమేష్ సహకారంతో ఏఈఈ, డీఏవో పరీక్షల్లో చూచిరాతకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించినట్లు తెలిపారు. వాటిని విశ్లేషిస్తున్న క్రమంలో మరింత సమాచారం బయటకు వచ్చిందని తెలిపారు. రమేష్ ప్రశ్నాపత్రాన్ని చాలామందికి విక్రయించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలిపారు.

Spread the love