కాంగ్రెస్‌కు పట్టం కట్టండి

– బలిదానాలు చూసి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు
– ఆ పార్టీకి పూర్వ వైభవం : హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌
– జడ్చర్లలో కాంగ్రెస్‌ బహిరంగ సభ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
సమైక్య భారతదేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని, బలిదానాలను చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌ కోరారు. సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌లో భాగంగా గురువారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, యువకులు 1500 మంది బలిదానాలు చూసి సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్‌ పార్టీ ముందు వరుసలో ఉన్నదన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నది ప్రజా క్యాబినెట్‌ కాదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హిమాచల్‌ ప్రదేశ్‌ మాదిరిగా పాతపెన్షన్‌ విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామని చెప్పారు. తద్వారా ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో విభజన రాజకీయాలను తిప్పికొట్టే విధంగా రాజీవ్‌గాంధీ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక విధానాలతో కాంగ్రెస్‌ నేతలను వేధిస్తే కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతమవుతాయని హెచ్చరించారు. దేశ సమైక్యత సమగ్రత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగం చేశారని, తద్వారా దేశాన్ని సమైక్యంగా ఉంచారని చెప్పారు. తొమ్మిది సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకపోగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, ఎర్రశేఖర్‌, అనిరుధ్‌ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love