– బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల నిర్వహణ
– ఏపీ, తెలంగాణ అంగీకారం
– సాంకేతికాంశాలపై మరోసారి భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉమ్మడిగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెేఆర్‌ఎంబీ)కు అప్పగించాలని రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నెల రోజుల్లోగా ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియను పూర్తి చేసేలా ఇరు రాష్ట్రాలు సహకరించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వారం రోజుల్లోగా ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఇకపై రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ వివాదాలకు ముగింపు పలికేలా ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ పూర్తిగా బోర్డు చేతుల్లోనే ఉంటుందని పేర్కొంది.
ఇటీవల ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులు, ఇంజినీర్లతో బుధవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరుల శాఖల ముఖ్యకార్యర్శులు శశిభూషణ్‌కుమార్, రాహుల్‌బొజ్జ, ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సి)లు బి నారాయణరెడ్డి, సి మురళీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ అంశాలపై మూడు గంటల పాటు చర్చించారు. రెండు రాష్ట్రాల ఇంజినీర్లు తమతమ అభిప్రాయాలు, వాదనలను కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఎదుట వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అంతా ఏపీ ప్రభుత్వం చేతుల్లో ఉందని జలశక్తి శాఖ కార్యదర్శి దష్టికి తెలంగాణ అధికారులు తీసుకెళ్లారు. అయితే నాగర్జునసాగర్ వ్యవహారంపై చర్చించాలని జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు. నాగార్జునసాగర్ నిర్వహణ అంతా కేఆర్‌ఎంబీకి అప్పగించే విషయమై తమ,తమ రాష్ట్ర పభుత్వాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు. విద్యుత్ ప్రాజక్టులు సహా ప్రాజెక్టు పరిధిలో ఉన్న అవుట్‌లెట్స్, సాంకేతిక పరిమితులు తదితర అంశాలపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు. ఏ ఏ అవుట్‌లెట్స్ ఎవరి పరిధిలో ఉండాలో కూడా తేలాల్సి ఉందని రెండు రాష్ట్రాల అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలపై ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లతో కూర్చుని ఒక నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సీఆర్‌పీఎఫ్ పెట్రోలింగ్‌ను యధాతథంగా ఉంచాలని రెండు రాష్ట్రాల అధికారులు, జలశక్తి అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. సాంకేతిక విషయాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో నివేదిక పంపిన తరువాత మరోసారి భేటీ ఉంటుందని జలశక్తి శాఖ కార్యదర్శి చెప్పినట్టు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌లో నవంబర్ 29కి ముందున్న నిర్వహణ విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ ఇంజినీర్లు కోరారు. అయితే ఈ ప్రతిపాదనను ఏపి ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గేట్ల నిర్వహణను తెలంగాణ చేతిలో పెడితే నీటి విడుదల అంశంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనీ, ఏపికి నీటి విడుదల సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర కార్యదర్శి దష్టికి తీసుకెళ్లారు. దీనిపై జోక్యం చేసుకున్న జలశక్తి శాఖ కార్యదర్శి వివాదం సాగర్ నుంచి మొదలైనందున మొదటగా దానిని పూర్తిగా బోర్డు నియంత్రణకు అప్పగించాలన్నారు.
దీన్ని తెలంగాణ ఇంజినీర్లు వ్యతిరేకించారు. ఉంటే రెండు ప్రాజెక్టులు పూర్తిగా బోర్డు నియంత్రణలోనే ఉండాలనీ, కేవలం సాగర్ ఒక్కదాన్ని అయితే తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. దీనిపై జోక్యం చేసుకున్న కేంద్ర కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, 2021లో సవరించిన గెజిట్ మేరకు రెండు ప్రాజెక్టులు, కాలువలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్‌తోసహా అన్నింటినీ బోర్డులు తన అధీనంలోకి తీసుకుని రోజు వారీ వాటి నిర్వహణ బాధ్యతలను చేపడుతాయనీ, వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రత కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులను పూర్తిగా బోర్డుకు అప్పగించేందుకు ఇరు రాష్ట్రాలు సహకరించాలనీ, దీనికి సంబంధించిన ప్రక్రియ వారంలోనే శ్రీకారంచుట్టాలని ఆదేశించారు. నెల రోజుల్లోనే అప్పగింతల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. దీనికి ఏపి, తెలంగాణ రెండు రాష్ట్రాలు సమ్మతించినట్టు తెలిసింది.