గోల్కొండ కోటలో సీఎస్‌

CS in Golconda Fort– స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలన.. పలు సూచనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు సోమవారం గోల్కొండ కోటను ఆమె సందర్శించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశిం చారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేయాలని డీజీపీ జితేందర్‌కు సూచించారు. మనదేశ సాంస్కృతిక వారసత్వం ప్రతిభింబించేలా సాంప్రదాయ దుస్తులలో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సాంస్కృతిక శాఖ సంచాలులు హరికృష్ణ తెలిపారు. గుస్సాడి, కొమ్ము కోయ, లంబాడీ, డప్పులు, ఒగ్గుడోలు ప్రదర్శన, బోనాల కోలాటం, భైండ్ల జమిడికల్‌, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికిపైగా కళాకారులు, స్వాతంత్య్ర దినోతసవ వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తారన్నారు. పిల్లల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిల్చేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎస్‌ వెంట డీజీపీ జితేందర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ వెంకట్‌ రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love