ప్రజాపాలన సేవా కేంద్రాలను సత్వరమే నెలకొల్పాలి: సీఎస్ ఏ.శాంతికుమారి

– పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశం..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
వివిధ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. మహాలక్ష్మి, గృహాజ్యోతి పథకాల ద్వారా అర్హత కలిగిన వారందరు ప్రయోజనం పొందేలా అన్ని ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ వార్డు ఆఫీసులలో సత్వరమే ప్రజాపాలన సేవా కేంద్రాలను నెలకొల్పాలని ఆదేశించారు. రాష్ట్ర డీ.జీ.పీ రవిగుప్తాతో కలిసి  శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సీ.పీలు, ఎస్పీలతో సి.ఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తులు చేసుకోలేకపోయిన అర్హులైన వారితో పాటు, దరఖాస్తులలో సరైన వివరాలు నమోదు చేయని వారి కోసం ప్రజాపాలన సేవా కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన పలు మండలాలలో ఎంపిడిఓ కార్యాలయాలు లేనందున, అలాంటిచోట తహశీల్ ఆఫీసులలో ప్రజాపాలన సేవా కేంద్రాలను అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కేంద్రాలు శాశ్వత ప్రాతిపదికన పనిచేసే అవకాశాలు ఉన్నందున, ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్ ఏర్పాటు చేస్తూ, డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నియమించాలని అన్నారు. వచ్చే  సోమవారం నాటికి అన్ని చోట్ల సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చి పనితీరు ప్రారంభం కావాలని స్పష్టమైన గడువు విధించారు. కార్యాలయాల పని దినాలలో ప్రతి రోజు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సేవ కేంద్రాలు తెరిచి ఉంచాలన్నారు.ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోలేకపోయిన వారి కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగా అభయహస్తం దరఖాస్తు ఫారాలను ప్రజాపాలన సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా సరైన రీతిలో వివరాలను పొందుపర్చలేకపోయిన దరఖాస్తుదారుల వివరాలను సరిచేస్తూ ఆన్లైన్లో అప్ డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీ.ఎస్ సూచించారు. ముఖ్యంగా వంట గ్యాస్ ఏజెన్సీ పేరు, వినియోగదారుడి నెంబరు, రేషన్ కార్డు వివరాలు, మొబైల్ నెంబరు తదితర వాటిని సరిచేస్తూ ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్మీడియట్ తో పాటు, త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ఏ చిన్న తప్పిదాలు, అవాంఛనీయ ఘటనలకు సైతం తావులేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లను అనుమతించకూడదని, కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యానికి తావిస్తూ, అక్రమాలకు ఆస్కారం కల్పించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. పరీక్షల నిర్వహణ తీరును అనునిత్యం సమీక్షిస్తూ, పరీక్షలు ముగిసేంత వరకు ఎంతో జాగరూకతతో వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, కాపీయింగ్ జరిగేందుకు అవకాశం ఉన్న సెంటర్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ట్రైన్ ఎస్పి రాజేష్ మీనా, జడ్పీ సీఈవో అప్పారావు, డిఎస్పి రవికుమార్ , డిఐఈఓ శంకరయ్య, డిపిఓ సురేష్ కుమార్, డి టి డి ఓ శంకరయ్య, మున్సిపల్ కమిషనర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love