సాగు కాల్వలీట్లా.. నీరు పారేదెట్లా..?

Cultivation is slow.. Water is drained..?– మట్టి,గడ్డితో నిండిపోతున్న డీ7 కాల్వ
– చివరి ఆయకట్టుకు నీరందడం ప్రశ్నార్థకమే..
నవతెలంగాణ – బెజ్జంకి
ఆయకట్టు భూములకు సాగు నీరందించే కాల్వలు మట్టి,గడ్డితో నిండిపోయాయి.నీరు ముందుకెళ్లకుండా మట్టి,గడ్డి పెరిగాయి.దీంతో చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడం ప్రశ్నార్థకంగా మారింది.బెజ్జంకి మండల రైతుల వ్యవసాయ సాగు పంటలకు అవసరమయ్యే నీటిని అందించేందుకు ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ జలాశయ నీటి వనరు మండల పరిధిలోని గుండారం,బెజ్జంకి,కల్లెపల్లి, లక్ష్మిపూర్ గ్రామ శివారులో డీ7 కాల్వ నిర్మాణం చేపట్టి చెరువులకు నీరు సరఫరా చేసి సాగుకు గత ప్రభుత్వం నీరదించింది.డీ 7 ప్రధాన కాల్వ మరమ్మతులపై ప్రభుత్వం,సంబంధిత అధికారుల అలసత్వం వల్ల సాగు కాల్వలో పూడిక పేరుకుపోవడంతో పాటు చెత్తచెదారంతో కాల్వ నిండిపోయి రూపురేఖలు మారిపోతున్నాయి.దీంతో నీరు చివరి ఆయకట్టుకు చేరుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ప్రతి ఖరీఫ్,రబీ సీజన్ లో రైతుల అవసరాల కోసం అన్నపూర్ణ జలాశయం నుంచి నీటిని డీ 7 కాల్వ ద్వార అయకట్టకు విడుదల చేస్తారు. ఇక్కడి నుంచి ప్రధాన కాల్వ ద్వారా చెరువులను నింపేందుకు విడుదల చేస్తుంటారు.వీటిని రైతులు తమ వ్యవసాయ అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఉంటుంది.
చివరికి అయకట్టుకు చేరేనా..?
ఈ కాల్వల ద్వారా వచ్చే నీటితోనే రైతులు తమ వ్యవసాయ అవసరాలను తీర్చుకుంటారు.అన్నపూర్ణ జలాశయం నుంచి కాల్వల్లో నీరు ప్రవహించి చివరి ఆయకట్టును చేరుకోవాలి. ప్రస్తుతం కాల్వ పరిస్థితి వల్ల నీరు చివరికి చేరుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మండలంలో రైతులు ప్రధానంగా వరి సాగు చేస్తారు. కాల్వల పరిస్థితి ఇలా ఉంటే అవసరాలకు నీరు పంటకు ఎలా అందుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే వర్షా భావ పరిస్థితుల వల్ల సకాలంలో వరి నాట్లు పడలేదని, ఇప్పుడు కాల్వల ద్వారా నీరు సకాలంలో అందకపోతే పంటకు నీటి తడుల్లో ఇబ్బందులు తప్పేలా లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు కాల్వలను బాగు చేసి చివరి ఆయకట్టుకు నీటిని అందించాలని కోరుతున్నారు.
గడ్డిని కాల్చి సాగునీరు సరఫరా..
కాల్వలో నిండిపోయిన గడ్డిని కాల్చి సాగునీరు సరఫరా చేస్తాం.ప్రభుత్వాధశానుసారం డీ 7 కాల్వ చివరి ఆయకట్టు గ్రామాలకు గత సీజన్లో నీరందించాం.ఈ సీజన్లో ప్రభుత్వాధేశానుసారం నీరందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.ఎక్కడైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం.రైతులకు ఆందోళన అవసరం లేదు.ఆయకట్టు పరిధిలోని అన్ని గ్రామాల చెరువులు నింపేందుకు చర్యలు తీసుకుంటాం: -నాగేశ్వర్ రావు,ఏఈ .
Spread the love