మణిపూర్‌లో మళ్లీ కర్ఫ్యూ..ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది. రాకెట్‌, డ్రోన్‌ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్‌ నెలకొంది. తాజా ఘర్షణల్లో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కూడా మణిపూర్‌లో పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతల దృష్ట్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల పాటు ఇంటర్నెట్‌ సేవలను నిషేధించింది. అయితే, కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపులు ఇచ్చారు.
మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాతుల మధ్య పోరాటానికి డ్రోన్లు, క్షిపణులను వినియోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ దాడుల్లో 11 మంది మరణించారు. ఈ నేపథ్యంలో డ్రోన్, క్షిపణి దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. సోమవారం ఇంఫాల్‌లోని రాజ్‌భవన్ ఎదుట పెద్ద సంఖ్యలో బైఠాయించారు. హింసాత్మక ఘటనలు పెరుగడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలను సెప్టెంబర్‌ 9, 10న మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. స్కూల్ యూనిఫారం ధరించిన విద్యార్థులు గవర్నర్‌ను కలిసి తమ నిరసన తెలిపేందుకు పట్టుబట్టారు.

Spread the love