కరెంట్‌ అఫైర్స్‌

కరెంట్‌ అఫైర్స్‌భారత్‌, ఫ్రాన్స్‌ ఆధ్వర్యంలో ‘త్రిష్ణా’
భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో), సెంటర్‌ నేషనల్‌ ఎట్యుడస్‌ స్పాట్‌లెస్‌ (సిఎన్‌ఇఎస్‌) అనే అంతరిక్ష సంస్ధలు సంయుక్తంగా థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ ఫర్‌ హైరిజల్యూషన్‌ నేచురల్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌ (త్రిష్ణా) అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ‘ఇండియా, ఫ్రాన్స్‌’ ఒప్పందం చేసుకున్నాయి. భూమి ఉపరితలంపై ఉష్లోగ్రతలు, ఉద్గారాలు, బయోఫిజికల్‌, రేడియేషన్‌, అధిక టెంపోరల్‌ రిజల్యూషన్‌ పర్యవేక్షణ కోసం ఈ ఉపగ్రహానికి రూపకల్పన చేయాలని నిర్ణయించుకున్నాయి. త్రిష్ణా ఉపగ్రహాం రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ రంగంలో గణనీయమైప పురోగతిని సూచిస్తుందని వారు ప్రకటించాయి. క్లిష్టమైన నీరు, ఆహాద భద్రత సమస్యల పరిష్కారానికి ఈ శాటిలైట్‌ మార్గం సుగమమం చేస్తుందని, ఇప్పటి వరకు ప్రయోగించిన రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలతో పోలిస్తే త్రిష్ణా శాటిలైట్‌ అనేక విశిష్టతల్ని కలిగి ఉంటుందని ఇస్రో పేర్కొంది. ఈ శాటిలైట్‌ను సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి ప్రయోగించనున్నారు.

పాలస్తీనాకు స్లావేనియా గుర్తింపు : పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్టు స్లావేనియా తాజాగా ప్రకటించింది. ఇప్పటికే 140 దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించాయి. ఆ జాబితాలో తాజాగా స్లావేనియా చేరింది. ఇటీవలే స్పెయిన్‌, నార్వే, ఐర్లాండ్‌ దేశాలు కూడా పాలస్తీనాను స్వతంత్రదేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించాయి. పాలస్తీనాని సార్వభౌమ దేశంగా గుర్తించాలని చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తూ 90 మంది సభ్యులు గల స్లావేనియా పార్లమెంట్‌లో 52 మంది అనుకూలంగా ఓటు వేయగా, ఒక్కరు కూడా వ్యతిరేకించకపోవటం గమనార్హం.

అంతరిక్షవాసంలో ప్రపంచ రికార్డు : అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా రష్యా వ్యోమగామి ఒవేగ్‌ కొనొనెంకో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. గతంలో 878 రోజులు అంతరిక్షంలో గడిపి హెన్నాడీ పడవ్కా నెలకొల్పిన రికార్డును ఒవేగ్‌ అధిగమించాడని రష్యా అంతరిక్ష సంస్ధ తెలిపింది. కొనెనెంకో ఈ సంవత్సరం జూన్‌ 5వ తేది నాటికి అంతరిక్షంలో 1000 రోజులు గడిపారని ఆ సంస్ధ ప్రకటించింది. అతను భూమి నుండి 283 మైళ్లు (423 కిలోమీర్లు) దూరంలో అంతరిక్షంలో ఉన్నారు.
విశాఖ పోర్టుకి అరుదైన ఘనత : ప్రపంచ బ్యాంకు ప్రకటించిన కంటైనర్‌ పోర్టుల పనితీరు సూచీ (సిపిపిఐ)లో అద్భుతమైన పనితీరును కనబరిచి టాప్‌ 20లో 18వ స్ధానం సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని కంటైనర్‌ పోర్టులు అందిస్తున్న సేవలతో పాటు వివిధ అంశాలను పరిగణనలోనికి తీసుకుని రూపొందిన జాబితాలో భారతదేశానికి చెందిన విశాఖ పోర్టు ఈ ఘనతను సాధించింది. అదేవిధంగా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను సరుకు రవాణాలో మెరుగైన సేవలందించిన మేజర్‌ పోర్టుల జాబితాలో విశాఖ పోర్టు 4వ స్ధానంలో నిలిచింది.

తెలంగాణాలో గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌ : అంతర్జాతీయ సరుకుల సంస్ధ (కమాడిటీస్‌), తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జూన్‌ 7, 8వ తేదిలలో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌ – 2024) ముగిసింది. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్ధల కన్సార్షియం, భారతదేశ వరి పరిశోధనా సంస్ధ, ఉత్తరప్రదేశ్‌లోని చంద్రశేఖర్‌ అజాద్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతదేశ వరి ఎగుమతిదారుల సమాఖ్య, ఫిక్కీ వంటి సంస్థలతో పాటు, దాదాపు 30 దేశాల నుండి వరి ఎగుమతి, దిగుమతిదారులు, వివిధ సంస్ధలకు చెందిన ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌కి భారతదేశం అతిథ్యం ఇవ్వటం ఇదే ప్రథమం.

మరోసారి అంతరిక్షంలోకి ‘సునీతా విలియమ్స్‌’ : భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకి సిద్ధమయ్యింది. బోయింగ్‌ సంస్ధ నిర్మించిన వ్యోమనౌకలో బుచ్‌ విల్‌ మోర్‌తో కలిసి రోదసీలో ప్రయాణం చేయనున్నారు. ఈ స్పేస్‌ మిషన్‌కి సునీతా విలియమ్స్‌ పైలెట్‌గా వ్యవహరించనున్నారు. అంతరిక్షంలో వారం పాటు గడిపిన తరవాత జూన్‌ 14న అదే వ్యోమనౌకలో భూమిని చేరుకుంటారు. ఈ యాత్ర విజయవంతం అయితే ఐఎస్‌ఎస్‌కి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి అమెరికా అమ్ములపొదిలో మరొక వ్యోమనౌక చేరినట్లవుతుంది.

చెక్కతో శాటిలైట్‌ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారి జపాన్‌కి చెందిన శాస్త్రవేత్తలు ‘లిగ్నోశాట్‌’ అనే చిన్న చెక్క ఉపగ్రహాన్ని తయారు చేశారు. దీని పనితీరున పరిశీలించడానికి కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుండి సెప్టెంబర్‌ నెలలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ లిగ్నోశాట్‌ని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు లాగింగ్‌ కంపెనీ సుమిటోమో ఫారెస్ట్రీ సహాకారంతో రూపొందించారు. మాగ్నోలియో కలపతో తయారు చేసిన ఈ చెక్క ఉపగ్రహ నిర్మాణానికి 2020లోనే శ్రీకారం చుట్టారు. లోహాలతో తయారు చేసిన ఉపగ్రహాల వల్ల అంతరిక్షంలో వ్యర్ధాలు పెద్దయెత్తున్న పేరుకు పోతున్నాయని, ఈ సమస్యను అధిగమించడానికే చెక్కతో ఉపగ్రహాలు తయారు చేయటం ప్రారంభించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఉపగ్రహా విజయవంతమైతే అంతరిక్ష వ్యర్ధాలను తగ్గించటంతో పాటు, పర్యావరణ అనుకూల ఉపగ్రహాల నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని సుమిటోమో ఫారెస్ట్రీ ప్రకటించింది.

వాయు కాలుష్య నివారణకు 10వేల కోట్లతో ప్రాజెక్టు : హార్యానా రాష్ట్రంలో వాయు కాలుష్య నివారణకు త్వరలో 10వేల కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ప్రకటించారు. హార్యానాలో వాయు నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అధునాతన మౌళిక సదుపాయాలను అప్‌గ్రేడ్‌ చేయటం, అత్యాధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేయటం, వాయు నాణ్యత నిర్వాహణలో పాల్గొనే వారికి తగిన శిక్షణను ఇవ్వటం వంటి అనేక కీలకాంశాలు ఈ ప్రాజెక్టులో అంతర్భాగాలుగా ఉంటాయని ఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంక్‌ నిధులతో ప్రారంభమయ్యే హర్యానా క్లీన్‌ ఎయిర్‌ ప్రాజెక్ట్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ ఈ ప్రాజెక్టు మొదటి దశలో జాతీయ రాజధాని ప్రాంతాలలో విస్తరించి ఉన్న జిల్లాలోని వాయు నాణ్యత, తదితర అంశాలపై పరిశోధన ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.

రుద్ర ఎమ్‌ – 2 పరీక్ష విజయవంతం : భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యాంటీ రేడియేషన్‌ మిస్సైల్‌ రుద్ర ఎమ్‌-2 ని విజయవంతంగా పరీక్షించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఒ) ఈ సూపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ని మే 29వ తేదిన ఒడిశాలోని చండీపూర్‌లోని టెస్ట్‌ రేంజ్‌ నుంచి ప్రయోగించారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మొట్టమొదటి దేశీయ యాంటీ రేడియేషన్‌ మిస్సైల్‌. ఈ మిస్సైల్‌ భారతదేశ రక్షణ వ్యవస్ధ సామర్ధ్యాలను గణనీయంగా పెంచుతుంది. రుద్ర ఎమ్‌-2 విజయవంతం కావటంతో భారత్‌ ఇటువంటి మిస్సైల్ల కోసం ఇతర దేశాల మీద ఆధారపడే అవసరం లేకుండా పోతుంది. దీని నిర్మాణంలో భాగస్వాములు అయిన డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలని భారత రక్షణ శాఖా మంత్రి రాజనాథ్‌ సింగ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

పుట్‌బాల్‌ దిగ్గజం సునీల్‌ ఛైత్రీ రిటైర్మెంట్‌ : భారత దేశానికి చెందిన పుట్‌బాల్‌ దిగ్గజం సునీల్‌ ఛైత్రీ ఆట నుండి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. భారత్‌, కువైట్‌ జట్ల ఫిఫా ప్రపంచ కప్‌ క్వాలిఫైయిర్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం సునీల్‌ ఛైత్రీ తన రిటైర్మెంట్‌ని ప్రకటించాడు. సునీల్‌ ఛైత్రీ తన కెరీర్‌లో మొత్తం 151 మ్యాచ్‌లు ఆడి, 94 గోల్స్‌ చేశాడు. భారతదేశం తరుపున ఆడి అత్యధిక గోల్స్‌ చేసిన క్రీడాకారుడిగా సునీల్‌ ఛైత్రీ రికార్డు సృష్టించాడు. దేశం తరుపున అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఛైత్రీ 4వ స్థానంలో ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత పుట్‌బాల్‌ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన ఛైత్రీ శకం ముగిసినట్లయ్యింది.

భద్రతా మండలిలో పాక్‌కు చోటు : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వతేతర దేశాల జాబితాలో పొరుగు దేశమైన పాకిస్థాన్‌ చోటు సంపాదించుకుంది. పాక్‌తో పాటు పనామా, సోమాలియా, గ్రీస్‌, డెన్మార్క్‌ దేశాలకు కూడా ఈ జాబితాలో చోటు సాధించాయి. ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో జరిగిన రహస్య ఓటింగ్‌లో ఈ దేశాలు అత్యధిక ఓట్లు సాధించాయి. 2025 జనవరి నుండి రెండేండ్ల పాటు 2026 డిశెంబర్‌ 31వ తేది వరకు ఇవి శాశ్వతేతర సభ్య దేశాల హోదాలో కొనసాగుతాయి.
డాక్టర్‌ కె. శశిధర్‌
పర్యావరణ నిపుణులు
94919 91918

Spread the love