కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsసూర్యుడిపై అధ్యయనం కోసం ‘ఆదిత్య ఎల్‌ 1’ : సౌరగోళం పై అధ్యయనం కోసం పి.ఎస్‌.ఎల్‌.వి. సి57 రాకెట్‌ 1475 కిలోల బరువు కల్గి ఆదిత్య ఎల్‌ 1 ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది. సౌర తుపాన్‌ సమయంలో వెలువడే రేణువుల వలన భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతోపాటు పోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్‌ యు.ఆర్‌. రావు స్పేస్‌ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు.
బాలికలు, మహిళల మిస్సింగ్‌లో మధ్యప్రదేశ్‌ టాప్‌ : దేశంలో 2019 – 2021 సంవత్సరాల మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండా పోయారని కేంద్రం తెలియజేసింది. ఇందులో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా సుమారు 2 లక్షల మంది వున్నారని ఆ తర్వాత స్థానంలో పశ్చిమబెంగాల్‌ వుందని కేంద్రం పేర్కొంది. గతవారం పార్లమెంట్‌లో కేంద్రం హోంశాఖ నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌.సి.ఆర్‌.బి) నమోదు చేసిన గణాంకాలను వెల్లడించింది. మూడేళ్ల కాలంలో మిస్సయిన మొత్తం 13.13 లక్షల మందిలో బాలికలు 2,51,430 మందికాగా, 18 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 10,61, 648 అని వివరించింది. 2019 – 21 మధ్య కాలంలో మధ్యప్రదేశ్‌ లో అత్యధికంగా 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు అదృశ్యమైనట్లు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ 2వ స్థానంలోనూ, కర్నాటక 3వ స్థానంలోనూ వుంది.
సాహిత్య అకాడమి అవార్డు – 2023 : వివిధ భాషల్లో చిరుకథలు, కవిత్వం, నాటకాలు, నవలలు, విమర్శ గ్రంథాలకు కేంద్ర సాహిత్య అకాడమి యువ, బాల పురస్కారాలు 2023 ను ప్రకటించింది. ప్రముఖ విమర్శకుడు తక్కెడశిల జాని, ప్రముఖ రచయిత డి.కె. చదువుల బాబులను కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు 2023 దక్కాయి. దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన బాల సాహిత్యానికి సంబంధించిన 22 మందికి యువపురస్కారాలకు 20 మందిని ఎంపిక చేసింది. తెలుగు భాషలో యువ పురస్కారాన్ని వై.ఎస్‌.ఆర్‌ జిల్లాకు చెందిన తక్కెడ శిల జాని రచించిన విమర్శన గ్రంథం ‘వివేచన’, బాల పురస్కారానికి వై.ఎస్‌.ఆర్‌. జిల్లాకు చెందిన డి.కె. చదువుల బాబు చిరు కథల పుస్తకం ‘వజ్రాల వాన’ దక్కించుకున్నాయి.
(ఞ) ఎక్స్‌ యాప్‌గా ట్విట్టర్‌ : ట్విట్టర్‌ యాప్‌ లోగోను మార్చనున్నట్లు ట్విట్టర్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ట్విట్టర్‌ ను రీ బ్రాండ్‌ చేయనున్నట్లు చైనాకు చెందిన విరు చాట్‌ తరహాలో అన్నింటికి పనికొచ్చే ఎక్స్‌ యాప్‌ను రూపొందించాలని కొంతకాలంగా అనుకుంటున్నట్లు ఎలాన్‌మస్క్‌ వెల్లండించారు. ఇది కేవలం సోషల్‌ మీడియా వేదికకగా కాకుండా ఆన్‌లైన్‌ చెల్లింపులకు, ఆహారాన్ని ఆర్డర్‌ చేయడానికి కూడా పనికొస్తుంది. ఇక నుండి మన మొబైల్‌ లో ట్విట్టర్‌ నోటిఫికేషన్స్‌ ఎక్స్‌ సింబల్‌గా చూపిస్తాయి.
కోల్డ్‌ ఔట్‌ కాఫ్‌ సిరప్‌ సురక్షితం కాదన్న డబ్ల్యు.హెచ్‌.ఒ : ఇరాక్‌లో విక్రయిస్తున్న భారత్‌ తయారీ దగ్గుమందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్‌ ఔట్‌’ పేరుతో రూపొందించిన సిరప్‌ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి వున్నాయని డబ్ల్యు.హెచ్‌.ఒ హెచ్చరించింది. చెన్నైకు చెందిన ఫోర్ట్స్‌ ల్యాబొరేటిస్‌ కంపెనీ తయారు చేసిన ‘కోల్డ్‌ ఔట్‌’ అనే దగ్గు మందును ఇరాక్‌కు చెందిన దాబిలైప్‌ ఫార్మాకు విక్రయించింది.
సి.బి.ఐ.సి చైర్మన్‌గా సంజరు కుమార్‌ అగర్వాల్‌ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ (సి.బి.ఐ.సి) కి చైర్మన్‌గా ఐ.ఆర్‌.ఎస్‌ అధికారి సంజరు కుమార్‌ అగర్వాల్‌ బాధ్యతలు స్వీకరించారు. మే 31న సి.బి.ఐ.సి చీఫ్‌గా వివేక్‌ జోహ్రి పదవీ విరమణ చేశారు. ఆగస్టు 5న జారీ చేసిన ఉత్తర్వుల్లో సి.బి.ఐ.సి మెంబర్‌ కంప్లయిన్స్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న సంజరు కుమార్‌ అగర్వాల్‌ను ఆ స్థానంలో నియమిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం : ప్రపంచంలోని ఆదివాసులు తమ హక్కులను పరిరక్షించుకోడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాల్లో 476 మిలియన్‌ లకు పైగా ఆదివాసీ ప్రజలు నివశిస్తున్నారు. వారు ప్రపంచ జనాభాలో 5 శాతం వున్నారు. అయితే ప్రపంచ అత్యంత పేదల జాబితాలో 15 శాతం కంటే ఎక్కువ మందిగా ఈ ఆదివాసీలు వున్నారు. పేదరికం, విద్య, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం, పర్యావరణ క్షీణత మొదలైన సవాళ్లను వీరు ఎదుర్కొంటున్నారు. 1994 డిసెంబర్‌ లో ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించింది. 2023 సంవత్సర ప్రపంచ ఆదివాసి దినోత్సవ ధీమ్‌ ‘స్వయం నిర్ణయాధికారం కోసం మార్పు. ఏజెంట్లుగా స్థానిక యువత’.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love