– రైతులను, కార్మికులను ముంచిన కాంగ్రెస్
– బతుకుల్ని ఆగం చేసిన బీజేపీని బలపరచొద్దు
– నవోదయ పాఠశాల కోసం మోడీకి 100 ఉత్తరాలు రాసినా ప్రధాని స్పందించలేదు : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
”తెలంగాణ ప్రజల బతుకులను ఆగం చేసిన మోడీకి ఓటేసి బీజేపీ ప్రభుత్వాన్ని బలపరచొద్దు.. చట్ట ప్రకారం ప్రతి జిల్లాకూ నవోదయ పాఠశాల రావాల్సి ఉండగా విద్యా కేంద్రాల కోసం 100 ఉత్తరాలు రాసినా ప్రధాని మోడీ స్పందించలేదు. మత ప్రాతిపదికన పరిపాలన కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలి.. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని, నాగర్‌కర్నూల్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి” అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌లో రోడ్‌షో అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలను ఆగం చేసిన బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటేస్తే పాలమూరు ప్రజల బతుకులు మరింత ఆగమైపోతాయని అన్నారు. పదేండ్లు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ అక్కరకురాని సుట్టంగా మారడని విమర్శించారు. సబ్‌కా వికాస్, డిజిటిల్ ఇండియా, మేకిన్ ఇండియా వికసిత భారత్‌తో తెలంగాణకు బుల్లెట్ ట్రైన్లు ఏమైనా వచ్చాయా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయి పట్టం గడితే రైతులను, కార్మికులను నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు పదిసార్లు విద్యుత్ అంతరాయం కలగడం చూస్తుంటే బాధేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జరిగిన రైతు ఆత్మహత్యలు మళ్లీ పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీకి.. బీఆర్‌ఎస్‌కు మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటేసి న్యాయం పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు పార్లమెంటు ఎన్నికల ద్వారా మరో పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాసులు గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జయపాల్ యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.