పీక్‌ డిమాండ్‌ పేరుతో ‘కరెంట్‌ షాక్‌’!

బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలెవరినీ వదిలేలా లేదు. భారాల మీద భారాలు వేస్తూనే ఉన్నది. తాజాగా విద్యుత్‌ చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేసుకుంది. పీక్‌ డిమాండ్‌ పేరుతో అధిక చార్జీల జీఓ అమలుకు ఆదేశాలు జారీచేసింది. దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నది. అయితే ఇప్పటికే కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు నానాయాతన పడుతున్నారు. ఉదాహరణకు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల అనేక కష్టనష్టాలు సంభవించాయి. ఇవి చాలవన్నట్టుగా విద్యుత్‌ చార్జీలు పెంచి కార్పొరేట్‌ శక్తులకు కడుపునింపే ప్రయత్నం శరవేగంగా అమలు చేస్తున్నది. ప్రతిరోజూ ఉదయం 6గంటల నుండి 10గంటల సమయంలో విద్యుత్తు చాలామందికి వినియోగిస్తారు. ఎందుకంటే ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే సమయమది. సాయంత్రం ఇంటికి వచ్చిన వాళ్లు అదే సమయంలో పడుకునేముందు వరకూ విద్యుత్‌ను ఎక్కువ వాడుతారు. ఈ సమయాలని అదునుగా తీసుకొని విద్యుత్‌ ఉదయం, సాయంత్రం వాడకంపై అధిక చార్జీలు వసూలు చేయాలంటూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? మోడీ చెప్పే అచ్చేదిన్‌ ఇదేనా? పర్యావరణం, సాంప్రదాయ ఇంధన వనరులు, జలవిద్యుత్‌, వాటిని ప్రోత్సహించేందుకు అంటూ దీనిపై కుంటిసాకులు చెబుతోంది.
సంప్రదాయ వనరుల ఇంధనం ఇప్పటికే ప్రయివేటు కార్పొరేటు సంస్థల చేతుల్లోనే ఉన్నాయనేది వాస్తవం. వారికి లబ్ధి చేకూర్చడం, వారికి అధిక ధనం కట్టబెట్టడం కోసమే పీక్‌ అవర్‌ పేరుతో జనాన్ని బాదేందుకు సిద్ధమైంది బీజేపీ సర్కార్‌. ఇప్పటికే గ్యాస్‌ బండ సబ్సిడీ ఎత్తేసి రూ.1200లు చేశారు. ఇప్పుడు విద్యుత్‌ సంస్కరణల పేరుతో అధిక చార్జీలు వసూలు చేసే చర్యలకు పూనుకుంటున్నారు. పీక్‌ అవర్‌లో కరెంటు వాడితే అధిక చార్జీలు చెల్లించాలని, తర్వాత వాడే కరెంటు చార్జీలు 20శాతం రాయితీ అంటూ బంగారం, బట్టల దుకాణాలలో వ్యాపారస్తులు ఇచ్చే డిస్కౌంట్‌ రూపంలో ప్రకటనలు చేస్తున్నారు. ముందు గానే టారిఫ్‌ రేట్లు పెంచి దానిలో 20శాతం రాయితీ అంటూ మరో మోసపూరిత వ్యాపారానికి కేంద్రం తెరలేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కొత్త విధానాన్ని తొలుత వాణిజ్య పారిశ్రామిక వినియోగ దారులకు అమలుపరిచి, అనంతరం గృహ వినియోగదారుల కరెంటు కలెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించి అమలు పరుస్తామని చెపుతున్నారు. 30రోజులకు తీయవలసిన విద్యుత్‌ బిల్లులు గడువు దాటిన అనంతరం తీస్తున్నారు. నెలలో 100యూనిట్లు వినియోగిస్తే ఒక యూనిట్‌కు రూ.3.60 పైసలు చొప్పున చెల్లించాలి. అదే కనుక రెండు మూడు రోజులు ఆలస్యంగా బిల్లులు తీస్తే 106యూనిట్లు బిల్లు వస్తే యూనిట్‌ ధర రూ.6.90పైసలు చొప్పున మొత్తం 106యూనిట్లకు డబ్బులు చెల్లించాలి. ఒక్కొక్క యూనిట్‌కి రూ.3 చొప్పున అదనపు బిల్లు చెల్లించాలి. మనకు తెలియకుండానే మన జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ రీతిగా పై అధికారుల ఆదేశాలు అనుసరించి బిల్లులు ఆలస్యంగా తీస్తూ మనలను దోపిడీ చేస్తున్నారు.
ఇవి కాక ఫిక్స్‌డ్‌ చార్జీలు, కస్టమర్‌ చార్జీలు, విద్యుత్‌ డ్యూటీ, ట్రూ ఆఫ్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, అంటూ పలు రకాల చార్జీల పేరుతో ప్రజలను బాదుడే బాదుతున్నారు. ప్రయివేట్‌ విద్యుత్‌ జనరేషన్‌ కంపెనీలు, బొగ్గు సరఫరా కంపెనీల ధనదాహానికి రాష్ట్ర ప్రజలను బలి చేస్తున్నారు. వాస్తవానికి అఖిల భారత స్థాయిలో గ్రిడ్డు ఏర్పరచిన తర్వాత జల విద్యుత్‌ వాటా పెరిగింది. విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం తగ్గినప్పటికీ ప్రయి వేటీకరణ వల్ల, పెట్టుబడిదారులకు విపరీతంగా లాభాలు కట్ట బెట్టడం కోసమే విద్యుత్‌ తయారీ వ్యయాన్ని ఎక్కువ చేసి చూపించి ప్రజలపై అధిక భారాలు మోపుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న మీటర్లు తొలగించి వాటి స్థానంలో స్మార్ట్‌ మీటర్లు బిగించబోతున్నారు. ఈ మీటర్ల ధర సుమారు రూ.7 వేల నుండి 13 వేల వరకు ఉంటుందని, మీటర్‌ చార్జీల ఖరీదును మన నుండి వసూలు చేయబోతున్నారు. స్మార్ట్‌ మీటర్లు తయారు చేసే ఆదానీ లాంటి ప్రయివేట్‌ కంపెనీల పెరుగుదల కోసమే మోడీ సర్కార్‌ పనిచేస్తుంది. ఆ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది, రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణల అమలు జరపాలని విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ప్రయివేటుకరించాలని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నది. దీనిపై సమగ్ర ఆధ్యాయనం చేసి ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఉన్నది.
– తోట సాంబశివరావు

Spread the love