వికలాంగుల పెన్షన్‌లో కోత

Cut in disability pension– మాజీ సైనికులకు మోడీ ప్రభుత్వం షాక్‌
– మండిపడిన ప్రతిపక్షాలు, సంఘాలు
న్యూఢిల్లీ : పదవీ విరమణ చేసిన సైనికుల కోసం మోడీ ప్రభుత్వం ప్రకటించిన నూతన వికలాంగుల పెన్షన్‌ నిబంధనలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వివాదం నడుస్తోంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నెల 21న నూతన నిబంధనలను ప్రకటించింది. పెన్షన్‌ పొందేందుకు వికలాంగులైన సైనికులకు ఉండాల్సిన అర్హతలను నిర్దేశించింది. పాత పెన్షన్‌ పద్ధతులన్నిం టినీ రద్దు చేసి, కొత్తగా నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం అంగవైకల్య శాతాన్ని బట్టి పెన్షన్‌కు అర్హుడా కాదా అనేది నిర్ణయిస్తారు. కొత్త నిబంధనల కారణంగా పెన్షన్‌లో పెద్ద ఎత్తున కోత పడే అవకాశం ఉందని సైనికులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ చర్యపై రిటైర్డ్‌ సైనికాధికారులు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇది మోడీ ప్రభుత్వ ‘బూటకపు జాతీయతావాదా’నికి అద్దం పడుతోందని కాంగ్రెస్‌ విమర్శించింది. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ‘ఎక్స్‌’లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ‘సైనికుల్లో 40శాతం మంది వికలాంగ పెన్షన్‌తో పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి గత తీర్పులు, నిబంధనలు, అంతర్జాతీయ నియమాలకు విరుద్ధంగా ఉంది’ అని తెలిపారు. మోడీ ప్రభుత్వ విధానంపై అఖిల భారత మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం కూదా నిరసన తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే సైనికులకు అతి తక్కువ ప్రయోజనాలు దక్కుతాయని విమర్శించింది.మోడీ ప్రభుత్వం పలు సందర్భాలలో సాయుధ దళాల ఉద్యోగ ప్రయోజనాలకు తూట్లు పొడిచిందని ఖర్గే గుర్తు చేశారు. దివ్యాంగ పెన్షన్‌పై పన్ను వేస్తామని 2019 జూన్‌లో ప్రకటించిందని, అగ్నిపథ్‌ పథకం, ఒకే ర్యాంక్‌ ఒకే పెన్షన్‌-2, ఎన్‌ఎఫ్‌యూ ఉపసంహరణ, వైద్య ప్రయోజనాల కుదింపు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు ప్రైవేటీకరణ వంటివి బూటకపు జాతీయవాదానికి నిదర్శనాలని ఆయన విమర్శించారు. అయితే అత్యున్నత స్థాయి సైనికాధికారి నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగానే నూతన నిబంధనలను రూపొందించామని కేంద్ర రక్షణ శాఖ చెబుతోంది. నూతన నిబంధనల్లో రక్తపోటు, మధుమేహం వంటి జీవనసరళికి సంబంధించిన వ్యాధులను చేర్చినప్పటికీ అత్యంత ఎత్తయిన ప్రదేశాలలో విధులు నిర్వహించే సమయంలో వైకల్యం పొందిన వారు మాత్రమే దీనికి అర్హులని ప్రభుత్వం మెలిక పెట్టింది. మిగిలిన వారికి కేవలం ఎక్స్‌గ్రేషియా మాత్రమే చెల్లిస్తారు. పదవీ విరమణ చేసిన సైనికాధికారులలో ప్రతి సంవత్సరం 36-40% మంది దివ్యాంగ పెన్షన్‌ పొందుతున్నారని, అదే సాధారణ సైనికులలో ఇది 15-18శాతం మాత్రమేనని ఈ సంవత్సరం మార్చిలో ఇచ్చిన నివేదికలో కాగ్‌ తెలిపింది. గత ఐదు సంవత్సరాలలో రక్షణ పెన్షన్ల చెల్లింపులు పెరిగాయి. 2018-19లో రూ. 1.08 లక్షల కోట్లుగా ఉన్న పెన్షన్‌ చెల్లింపులు 2023-24 నాటికి రూ.1.38 లక్షల కోట్లకు చేరాయి. పెరుగుతున్న పెన్షన్‌ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం నూతన నిబంధనలు తీసుకొచ్చింది. అయితే నూతన నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని అఖిలభారత మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం ఛైర్‌పర్సన్‌ భీమ్‌సేన్‌ సెహగల్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గత వారం ఆయన రక్షణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

Spread the love