– సైబర్ మోసంలో లక్షల నష్టం
నవతెలంగాణ – బాన్సువాడ/ నసురుల్లాబాద్
సైబర్ నేరగాళ్లు ప్రజల్ని మోసగించేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. మారుతున్న పరిణామాలు.. తాజా అంశాలను ఆసరాగా చేసుకుని డబ్బు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బాన్సువాడ మండలంలోని తడ్కోల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల మోసనికి రూ.1,38,200 పోగొట్టుకున్నాడు. బాన్సువాడ టౌన్. సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాడ్కోల్కు చెందిన అంకం విష్ణువర్ధన్ కు ముందుగా వాట్సాప్ లో ఉద్యోగం పేర ఓ మెసేజ్ రావడంతో ఆన్ లైన్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జూలై 29న డేటా ఎంట్రీ ఉద్యోగం వచ్చిందని, వాట్సాప్ లో లింక్ పంపించారు. ఈ నెల 10న యువకుడు వివరాలు పూర్తిచేసి తిరిగి పంపించాడు. నీవల్ల మాకు సంస్థకు నష్టం వాటిల్లిందని చెప్పి, కేసు నమోదు చేస్తామని బెదిరించారు. కోర్టుకు పిలిచినప్పుడు రావాలని యువకుడిని భయపెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరిట డబ్బులు కావాలని మోసగాళ్లు డిమాండ్ చేశారు. కోర్టులో కేసు మాఫీ చేస్తామని దాని ఖర్చులకు డబ్బు పంపాలని డిమాండ్ చేశారు. నేరగాళ్ల భయానికి భయపడి విడతల వారీగా రూ.1.38 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయినట్లు గుర్తించి 1930 నంబర్ కు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, గుర్తుతెలియని ఉత్తరాలు, మేసేజ్ లు వచ్చిన వాటికి స్పందించవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని బాన్సువాడ టౌన్ సిఐ కృష్ణ తెలిపారు. బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు.