గుజరాత్‌ తీరాన్ని తాకిన తుపాను

– అల్లాడుతున్న కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాలు
– తీర ప్రాంతాల్లో ప్రచండ గాలులు, కుంభవృష్టి
– ఆరు మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న అలలు
– పల్లపు ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చిన సముద్రం
– ముంబయిలో సముద్రం అల్లకల్లోలం
– 20గ్రామాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు
– సన్నద్ధంగా వున్న సైన్యం, నేవీ దళాలు
కచ్‌ : అరేబియా సముద్రంలో పది రోజుల క్రితం ప్రారంభమై అత్యంత తీవ్రమైన తుపానుగా మారిన బిపారిజారు తుపాను ఉగ్ర రూపంతో గుజరాత్‌ తీర ప్రాంతంపై విరుచుకుపడింది. కచ్‌ జిల్లాలో జకావు పోర్టుకు సమీపంలో తీరాన్ని తాకిందని గురువారం సాయంత్రం భారత వాతావరణ విభాగం తెలిపింది. గురువారం సాయంత్రం తుపాను తీరాన్ని దాటే క్రమం ఆరంభమైందని అయితే మొత్తం తుపాను తీరాన్ని దాటేందుకు కనీసం ఆరు గంటలు పడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. మూడో కేటగిరీలోని ఈ తుపానును ‘అత్యంత తీవ్రమైన తుపాను’ వర్గీకరించారు. తుపాను తీరాన్ని దాటే సమయంలో పెను విధ్వంసం చోటు చేసుకోవచ్చని ఎలాంటి పరిస్థితులనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనాల్సిందిగా అధికార యంత్రాంగం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత పది రోజులుగా ఈ తుపాను గురించి వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా తుపాను ధాటికి గుజరాత్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా గురువారం సాయంత్రానికి గుజరాత్‌ తీర ప్రాంతమంతా కుంభవృష్టి కురుస్తోంది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కచ్‌, సౌరాష్ట్ర తీర ప్రాంతాలు అల్లాడుతున్నాయి. ఈ తుపాను మూలకేంద్రం (సైక్లోన్‌ ఐ ) దాదాపు 50కిలోమీటర్ల విస్తీర్ణంలో వుందని. గంటకు 13నుండి 14కిలోమీటర్ల వేగంతో ముందుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ప్రస్తుతానికి గంటకు వంద నుండి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటే క్రమంలో ఇవి మరింత పెరుగుతాయి. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరాన్ని దాటే ప్రాంతంలో పది కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 20గ్రామాల నుండి లక్ష మంది వరకు ప్రజలను ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భుజ్‌, ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌ తీర ప్రాంతాల్లో మూడు నుండి ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. చాలాచోట్ల పల్లపు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. ద్వారక, మండ్వి, మోర్బి జిల్లాలో బలమైన గాలులతో పాటూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయిలో సముద్రం అల్లకల్లోలంగా వుంది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. కాగా ఈ ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి గుజరాత్‌ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కచ్‌, సౌరాష్ట్రల్లోని ఆరు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తీర ప్రాంత జిల్లాల్లో ఇప్పటికే ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి చెందిన 18 బృందాలు, రాష్ట్ర విపత్తు దళాలు 12 బృందాలు మోహరించాయి. భుజ్‌, జామ్‌నగర్‌, గాంధీనగర్‌ల వ్యాప్తంగా 27 రిలీఫ్‌ సైనిక దళాలను మోహరించినట్లు ఆర్మీ ప్రకటించింది. రోడ్లు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలను, విద్యుత్‌ విభాగాలకు చెందిన 397మంది అధికారులను వేర్వేరు తీర ప్రాంత జిల్లాల్లో మోహరించారు.

Spread the love