నాన్నంటే ఒక రోజు కాదు ఒక జీవితం.

”ఓ నాన్న! నీ మనసే వెన్న …
అమతం కన్నా అది ఎంతో మిన్న..
ఓ నాన్న ఓ నాన్న ..”
నాన్న గొప్పతనాన్ని చాటే సినారే గీతం గుర్తుందా..
నాన్న అనే పదానికి గుర్తింపు ఇచ్చేది అమ్మ. నాన్న ఎవరో అమ్మ చెబితేనే తెలుస్తుంది.
నాన్నంటే ఎవరు?
నాన్నంటే ఒక నమ్మకం
నాన్నంటే ఒక బలం
నాన్నంటే ఒక భరోసా
నాన్నంటే ఒక భద్రత
నాన్నంటే ఒక బాధ్యత
నాన్నంటే మమకారపు గొడుగు
నాన్నంటే దిశా నిర్దేశకుడు
నాన్నంటే శక్తివంతమైన గురువు
నాన్నంటే ఆత్మీయ నేస్తం
పిల్లల భవిష్యత్‌ కోసం నిరంతరం శ్రమించే నాన్న త్యాగానికి మారుపేరు. తనకోసం ఆలోచించకుండా కుటుంబానికి వెన్నెముకగా నిలిచే నాన్న ఓ నీలాకాశం. తండ్రి గురించి చాలా చాలా చెప్పుకోవచ్చు. అటువంటి తండ్రి కోసం ఏడాదిలో ఒక రోజు ప్రత్యేకమైన రోజు. అది జూన్‌ మూడో ఆదివారం.
చూపుడు వేలితో లోకాన్ని చూపిస్తూ బతుకు పాఠాలు నేర్పే నాన్న కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, పిల్లల పనులు చేయడం న్యూక్లియర్‌ కుటుంబాల వల్ల పెరిగింది. 1965లో తండ్రులు పిల్లలతో రోజుకు 16 నిమిషాలు మాత్రమే గడిపేవారు. అదే 2012 కి 59 నిమిషాలకు పెరిగింది. ఇప్పుడు 75 నిమిషాల పైనే.
పిల్లలను సంరక్షించే వాడు, ప్రోత్సహించేవాడు, ఆప్యాయంగా ఉండేవాడు, అన్ని విషయాల్లోనూ భరోసా ఇస్తూ బాధ్యత వహించేవాడు, పిల్లలు చెప్పింది వినేవాడు, అదే విధంగా పిల్లల తల్లిని గౌరవించేవాడు, పిల్లలు, వారి తల్లి కోసం నాణ్యమైన సమయం గడుపుతూ మంచి టీచర్‌ గా వ్యవహరించే తండ్రి.
పితృ దినోత్సవం ఎందుకు?
కుటుంబంలో తల్లి పాత్ర తర్వాత తండ్రి పాత్ర కనిపిస్తుంది. అయితే బిడ్డకు తల్లి ఎంత ముఖ్యమో, ఎంత కీలకమో తండ్రి కూడా అంతే ముఖ్యం. అంతే కీలకం.
తండ్రిని, తండ్రి తన పై చూపిన ప్రభావాన్ని గుర్తించడం, గౌరవించడం, వారిని అభినందించడం కోసం ఫాదర్స్‌ డే ప్రారంభమైంది. తండ్రులు, వారి తండ్రులు, వారి తండ్రులు అందరూ… ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రులైన వాళ్ళు, తండ్రి స్థానంలో నిలిచిన వాళ్ళు, నిలిచే వాళ్ళు అందరిదీ ఈ పండుగ.
అమూల్యమైన తండ్రికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తూ తమ ప్రేమను వ్యక్తపరిచే అవకాశం పిల్లలకు ఇస్తుంది ఫాదర్స్‌ డే.
తండ్రి, పిల్లల మధ్య పరస్పర అనుబంధం, ప్రేమానురాగాలు, నమ్మకం పెంచే ప్రత్యేకమైన రోజు ఇది.
తండ్రుల దినోత్సవ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి?
అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో మోనోన్గా గనిలో 1907లో పెద్ద ప్రమాదం జరిగింది. 361 మంది చనిపోయారు. వారిలో 250 మంది పిల్లలు ఉన్న తండ్రులే. ఆ ఘటనలో దాదాపు వేయి మంది పిల్లలు తండ్రి లేని వారయ్యారు. ఇలాంటి పిల్లల్లో గ్రేస్‌ గోల్డెన్‌ కలితం ఒకరు. ఆమె తన తండ్రి స్మారకంగా స్థానిక చర్చిలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అది ఆ ఒక్క ఏడాది మాత్రమే జరిగింది.
అమెరికాలో వాషింగ్టన్‌ కి చెందిన సోనారా స్మార్ట్‌ డాడ్‌ ఆలోచన నుంచి పుట్టింది నాన్నల దినోత్సవం.
సోనారా ఆరు నెలల పసి పిల్ల గా ఉన్నప్పుడు తల్లిని కోల్పోయింది. ఆమె తండ్రి తల్లి బాధ్యత కూడా తీసుకున్నాడు. సివిల్‌వార్‌లో పాల్గొన్న ఆమె తండ్రి విలియం స్మార్ట్‌ సోనారా తో పాటు ఆరుగురు పిల్లలకు తల్లి అయి పెంచాడు. మళ్లీ పెళ్లి చేసుకునే వయసు, అవకాశం, హక్కు ఉన్నప్పటికీ అతను మరో పెళ్లి జోలికి పోలేదు. తన సుఖసంతోషాలను పక్కకు పెట్టి పిల్లల బాధ్యత తీసుకున్నాడు. తల్లిలేని లోటు తెలియకుండా పెంచాడు. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.
తండ్రులలో తన తండ్రి అత్యుత్తమ వ్యక్తి అనుకునేది సోనారా. తన తండ్రి పాత్రకు ఒక గుర్తింపు గౌరవం దక్కాలని తపన పడింది ఆమె. 27 ఏళ్ల వయసులో సోనారా కు వచ్చిన ఆ ఆలోచన ఫలితమే ఫాదర్స్‌ డే. తండ్రి గౌరవార్ధం ఆయన పుట్టిన రోజున తండ్రుల దినోత్సవం జరపాలని భావించింది. అయితే తండ్రి జూన్‌ నెలలో పుట్టాడని తెల్సు కానీ తేదీ తెలియదు. అందుకే జూన్‌ నెలలో ఏదో ఒక రోజు ఈ వేడుక జరపాలని భావించింది. అనుకున్నట్టుగానే జూన్‌ నెలలో ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరిని పిలిచింది. ఇది తన తండ్రి పుట్టినరోజు మాత్రమే కాదని, తండ్రులు పోషించే పాత్ర సమాజానికి, పిల్లలకు తెలిపే రోజని, ఈ రోజును ఫాదర్స్‌ డే జరుపుకుందామని ప్రకటించింది. ఆ ఆలోచన గ్రామస్తులకు నచ్చింది. జూన్‌ 19, 1910 మొదటి సారి ఆ గ్రామంలో ఫాదర్స్‌ డే వేడుక నిర్వహించారు. తర్వాత పక్క గ్రామాలకు పాకింది. అలా అమెరికాలో ఫాదర్స్‌ డే వేడుకలు ప్రారంభం అయ్యాయి.
1916లో అప్పటి అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌ దీన్ని అధికారికంగా ఆమోదించారు. 1924లో అప్పటి అమెరికా అధ్యక్షుడు కెల్విన్‌ కూలిడ్జ్‌ ఫాదర్స్‌ డే మద్దతు ప్రకటించారు.
1966లో జూన్‌ మూడో ఆదివారం ఫాదర్స్‌ డే ని గుర్తిస్తూ దీనికి సంబంధించిన తీర్మానంపై అధ్యక్షుడు లిండన్‌ బి జాక్సన్‌ సంతకం చేశారు. 1972లో జూన్‌ మూడో ఆదివారం నాన్నల దినోత్సవానికి జాతీయ గుర్తింపు నిస్తూ ఆనాటి అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ చట్టంపై సంతకం చేసాడు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్‌ డే ప్రసిద్ధమైంది
అన్నిదేశాలూ జరుపుకుంటాయా?
ప్రపంచమంతా ఫాదర్స్‌ డే జరుపుకోవడం కనిపిస్తుంది. అయితే అన్ని దేశాలు జూన్‌ మూడో వారంలో జరపవు. అమెరికా, కెనడా, యూకే మొదలైన 111 దేశాలు జూన్‌ మూడో ఆదివారం జరుపుకుంటే, ఆస్ట్రేలియా సెప్టెంబర్‌ మొదటి ఆదివారం జరుపుతుంది. స్పెయిన్‌, ఇటలీ, పోర్చుగీస్‌ లలో రోమన్‌ కాథలిక్కులు మార్చి 19న సెయింట్‌ జోసెఫ్‌ డే ని తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటారు.
ఎలా జరుపుకుంటారు?
తండ్రిని గౌరవిస్తూ, అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్‌ కార్డ్స్‌ ఇవ్వడం, సర్ప్రైజ్‌ గిఫ్ట్‌, కానుకలు ఇవ్వడం జరుగుతున్నది. వాచీలు, పెన్నులు, షర్టులు, టై, షూస్‌, మొబైల్‌, ఆట వస్తువులు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌… వంటివి ఆ కానుకల్లో ఉంటాయి.
బడి పిల్లలు తండ్రుల కోసం స్వయంగా గ్రీటింగ్‌ కార్డ్‌ తయారు చేసి అందిస్తారు. చిన్న చిన్న బహుమతులు వారి పాకెట్‌ మనీ నుంచి కొంటారు. ఆ దేశాల్లో పిల్లల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తాయి బడులు.
తండ్రి బతికి ఉన్నట్లైతే ఎర్ర గులాబీ ధరించడం, తండ్రి చనిపోతే తెల్ల గులాబీ ధరించడం కొన్ని సమాజాలలో ఆనవాయితీ.
ఫాదర్స్‌ డే వ్యాపారం
వ్యాపార, వస్తు వినిమయ ప్రపంచంలో బతుకుతున్నాం. వ్యాపార వర్గం ప్రతి సంఘటన, పండుగ తనకు అనుకూలంగా మలుచుకుని వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా విస్తరించుకుంటూ పోతుంది. ఫాదర్స్‌ డే అందుకు మినహాయింపు ఏమీ కాదు.
ఏడాదికేడాదికి కొత్త పుంతలు తొక్కుతూ తయారయ్యే గ్రీటింగ్‌ కార్డులు, కానుకలు పిల్లల నుండి తండ్రులకు ప్రపంచ నలుమూలల బట్వాడా అవుతున్నాయి. ఏటా 87 మిలియన్‌ ఫాదర్స్‌ డే గ్రీటింగ్‌ కార్డులు గమ్యం చేరుతున్నాయి.
ఫాదర్స్‌ డే పేరిట జరిగే వ్యాపారం రోజురోజుకు పైపైకి ఎగబాకుతున్నది. 2012లో 12.7 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగితే 2022 నాటికి అది 20.5 బిలియన్‌ డాలర్లకు చేరింది.
ఆ ఒక్క రోజు బయటకు వెళ్ళడానికి, బట్టలు, గిఫ్ట్‌ కార్డ్స్‌ కి, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇతర కానుకల కోసం అయ్యే ఖర్చు ఇది.
భారతీయ సంస్కతిలో ఉందా?
భారతీయ సంస్కతిలో ఫాదర్స్‌ డే కి తావు లేదు. కానీ లక్షలాది భారతీయులు కూడా పెద్ద ఎత్తున ఫాదర్స్‌ డే జరుపుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులు, మీడియా, వినిమయ సంస్కతి ఫాదర్స్‌ డే ని మనకు దగ్గర చేసింది.
మారుతున్న తండ్రి పాత్ర
ఒకప్పుడు గంభీరంగా, కఠినంగా కనిపించే తండ్రి కష్టపడి సంపాదించి కుటుంబ పోషణ భారం వహించేవాడు. పిల్లల ఫీజులు, వైద్య అవసరాల వంటి విషయాలు తప్ప పిల్లల విషయంలో జోక్యం ఉండేది కాదు. తండ్రి గంభీరంగా చూసినా, కళ్లెర్ర జేసినా పిల్లలు వణికి పోయేవారు. ఆ కాఠిన్యం వెనుక దాగిన మమకారం, సున్నితత్వం పిల్లలకు తెలిసేది కాదు. ఇద్దరి మధ్య కనిపించేంత దూరం ఉండేది.
బిడ్డలు విజయవంతమైన వ్యక్తులుగా మారడంలో, సామాజిక నైతికత తెలిసిన విలువైన వ్యక్తులుగా రూపొందడంలో తండ్రి గొప్ప పాత్ర అస్పష్టంగా ఉండేది. తండ్రి చేసిన నిస్వార్థ సేవలు, సంరక్షణ గుర్తించి అభినందించడం వల్ల తండ్రి బిడ్డలు మానసికంగా దగ్గరవుతారు.
ఇరవైనాలుగు గంటలు పిల్లలకు అందుబాటులో ఉండే అమ్మ ఉద్యోగం చేయడంతో నాన్న పాత్రలో మార్పు అనివార్యం అయింది. తండ్రుల దక్పథంలో మార్పుకి కారణం అయింది.
మగవాళ్ళు దేశానికి రాజైనా ఇంట్లో పిల్లల్ని పెంచలేరు అనే నానుడిని తప్పని నిరూపిస్తున్నారు నేటి తరం తండ్రులు. ఆధునిక సమాజంలో తండ్రి సంప్రదాయ విధుల నుంచి క్రమంగా బయటపడుతున్నాడు. తండ్రిగా తన పాత్రను మార్చుకుంటున్నాడు.
ఆధునిక తండ్రి అధికార పాత్రల కంటే ఎక్కువ పాత్ర పోషించడానికి సన్నద్ధం అవుతున్నారు. పిల్లలకు లాల పోయడం, కడుపు నింపడం, లాలించడం వంటి పనులు కూడా చేస్తున్నారు. నడకలు, నడతలు నేర్పిస్తున్నాడు. ఆలనా పాలనా అండదండలు అందిస్తూ స్నేహంగా మెసులుతున్నాడు. ఆట పాటలు నేర్పుతున్నారు. తండ్రి ఆట స్థలాలు, వాకింగ్‌, జాగింగ్‌ వంటి వాటికి పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు. పిల్లల ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు.
పిల్లల స్కూల్‌ ప్రాజెక్ట్‌ విషయంలో సహాయం చేస్తున్నారు. నైపుణ్యాలు మెరుగుపరచడంలో తండ్రి భాగస్వామ్యం పెరుగుతున్నది. తండ్రి కూడా పిల్లలకు సమయం ఇస్తున్నాడు. సహనంగా ఉంటున్నాడు. సహకారం అందిస్తున్నాడు.
చూపుడు వేలితో లోకాన్ని చూపిస్తూ బతుకు పాఠాలు నేర్పే నాన్న కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, పిల్లల పనులు చేయడం న్యూక్లియర్‌ కుటుంబాల వల్ల పెరిగింది. 1965లో తండ్రులు పిల్లలతో రోజుకు 16 నిమిషాలు మాత్రమే గడిపేవారు. అదే 2012 కి 59 నిమిషాలకు పెరిగింది. ఇప్పుడు 75 నిమిషాల పైనే.
గత దశాబ్ద కాలంలో ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో పిల్లల పెంపకంలో కొత్త తరం నాన్నలు ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు.
ఒకప్పుడు కఠినంగా కనిపించే నాన్నతో కలిసి కూర్చోవడానికి, మాట్లాడడానికి వణికే పిల్లలు ఇప్పుడు స్నేహితుల్లా మసులుతున్నారు. మారుతున్న కాలంతో పాటు తండ్రి పిల్లల మధ్య అనుబంధంలో కూడా అనేక మార్పులు వచ్చాయి.
తండ్రులతో అనుబంధం ఉన్న పిల్లలు మానసికంగా సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారని, మెరుగైన సామాజిక బంధాలు కలిగి ఉంటారని, చదువులో రాణిస్తారని 2006లో ‘ది ఇంపార్టెన్స్‌ ఆఫ్‌ ఫాదర్స్‌ ఇన్‌ ది హెల్తీ డెవలప్మెంట్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌’ పేరుతో జరిగిన అధ్యయనం పేర్కొంది.
తండ్రి బిడ్డల అనుబంధం వల్ల ప్రవర్తన లోపాలు తక్కువగా ఉంటాయి. పిల్లలు తమ స్నేహితుల స్థానంలో తల్లిదండ్రులను చూడగలిగిన నాడు పెద్దలు కూడా పిల్లలాగా ఆలోచించగలరు. టీనేజ్‌ పిల్లలు ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
6-14 వయసు పిల్లలకు ముఖ్యంగా మగ పిల్లలకు తండ్రి మార్గదర్శకత్వం చాలా అవసరం. 18 ఏళ్లు వచ్చేసరికి తండ్రి మరింత ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది.
పిల్లలతో మాట్లాడడం, వారు చెప్పేది వినడం వల్ల తండ్రికి ఆహ్లాదకరంగా, తప్తిగా ఉంటుంది. అది అనుకోకుండా అనుభవించిన బిల్‌ గేట్స్‌ ప్రతి రోజూ పిల్లల్ని బడి దగ్గర వదిలే బాధ్యత తీసుకుని ఆ సమయంలో పిల్లలతో ముచ్చటించడం మొదలు పెట్టారు.
పిల్లల భావోద్వేగాలను పంచుకోవడంలో, పిల్లలు తమ నైపుణ్యాలను పెంచుకోవడంలో, జ్ఞానాభివద్ధిలో, అభివద్ధిలో తండ్రుల భాగస్వామ్యం గతంతో పోల్చితే పెరిగినప్పటికీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది.

మంచి తండ్రి అంటే…
పిల్లలను సంరక్షించే వాడు, ప్రోత్సహించేవాడు, ఆప్యాయంగా ఉండేవాడు, అన్ని విషయాల్లోనూ భరోసా ఇస్తూ బాధ్యత వహించేవాడు, పిల్లలు చెప్పింది వినేవాడు, అదే విధంగా పిల్లల తల్లిని గౌరవించేవాడు, పిల్లలు, వారి తల్లి కోసం నాణ్యమైన సమయం గడుపుతూ మంచి టీచర్‌ గా వ్యవహరించే తండ్రి.
ఆధునిక సమాజంలో సాంకేతికంగా అభివద్ధి చెందిన సమయంలో అనేక సౌకర్యాలు మన ఇళ్లలో తిష్ట వేశాయి. వాటికి పిల్లల్ని బానిసల్ని చేయకుండా పిల్లలకు కొత్త మార్గాల్లో సమయం గడపడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యత అని నేటి తరం తండ్రి గుర్తిస్తున్నాడు. పిల్లల బాధ్యతల్ని మురిపెంగా తలెత్తుకుని సంతోషంగా ఉండే తండ్రులు కొందరైతే, కొంత మంది తండ్రులు మాత్రం స్మార్ట్‌ ఫోన్‌ నుంచి తలెత్తరు. ఒళ్ళు వంచరు. పిల్లల పెంపకంలో తనకేమాత్రం సంబంధం లేదనుకుంటారు.
మంచి తండ్రి ఉన్న బిడ్డలు ధన్యులు
ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే మరో వైపు ముందు తరాల్ని నిలబెట్టాల్సిన తండ్రి, జూదం, మద్యం లకు బానిసై .. కుటుంబ కాడి వదిలేస్తున్నారు. గురువుగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, బాధ్యత గల పౌరుడిగా, మార్గదర్శిగా అన్ని రకాల పాత్ర పోషించాల్సిన నాన్న పట్ల ఏహ్యభావం పెరిగేలాగా ప్రవర్తిస్తున్నాడు. కన్న బిడ్డల బాగోగుల కోసం రేయింబగళ్లు కష్టపడి బాధల్ని కనురెప్పల మాటున దాచేసి ప్రేమానురాగాలు కురిపించాల్సిన నాన్న మద్యం మత్తులో తూగుతూ కడతేరిపోతున్నాడు, పిల్లలపై మోయలేని భారం మోపుతున్నాడు.
తండ్రులూ… తస్మాత్‌ జాగ్రత్త. మీ సమయాన్ని మీ పిల్లల కోసం వెచ్చించండి. వారి బలాబలాలు పెంచుకోవడంలో దష్టి పెట్టండి. వారికి ఎదురయ్యే ఒత్తిడి, సవాళ్లు ఎదుర్కోవడంలో మార్గనిర్దేశం చేయండి. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచండి. బిడ్డల జీవిత ప్రయాణంలో మీరు గొప్ప బహుమానంగా నిలవండి.
పిల్లలూ మీరు కింద పడితే నీకు నేనున్నానని వెన్ను తట్టి లేపిన తండ్రిని సదా మనసులో నింపుకుని, జీవన సంధ్యలో ఉన్న తండ్రికి భరోసా అవ్వండి. బతుకునిచ్చిన తండ్రికి ఊతకర్రలా నిలవండి. మీకోసం మంచుకొండలా కరిగిన తండ్రి భావోద్వేగాలు గమనించండి, మానసిక శారీరక ఆరోగ్యం కనిపెట్టుకుని నాన్న కంటి చుక్క రాలకుండా చూడండి.
నాన్నంటే ఒక రోజు కాదు ఒక జీవితం.

– వి. శాంతి ప్రబోధ, 9866703223

Spread the love