దలాల్‌ స్ట్రీట్‌ అల్లకల్లోలం

Dalal Street mayhem– రూ.31లక్షల కోట్ల సంపద ఆవిరి
– సెన్సెక్స్‌ 4300 పాయింట్ల పతనం
– చరిత్రలోనే అతిపెద్ద నష్టం
– మదుపరి విలవిల
– ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చేరని బీజేపీ
ముంబయి : దలాల్‌ స్ట్రీట్‌లో అల్లకల్లోలం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను చేరకపోవడం మార్కెట్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే బేర్‌ పంజాతో మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 4300 పాయింట్ల పైగా పతనమయ్యింది. స్టాక్‌ మార్కెట్ల చరిత్రలోనే ఎన్నికల ఫలితాల వేళ అత్యంత భారీ నష్టాలతో ముగియడం ఇదే తొలిసారి. ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు నేల చూపులు చూశాయి. ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్న క్రమంలో మార్కెట్లు మరింత ఎరుపెక్క సాగాయి. అన్ని రంగాలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఏ సమయంలోనూ సూచీల పతనం ఆగలేదు. ఓ దశలో సెన్సెక్స్‌ ఆరు శాతం పైగా క్షీణించడంతో ఇన్వెస్టర్లు రూ.45లక్షల కోట్ల విలువ కోల్పోయారు. సెన్సెక్స్‌ ఉదయం 2,000 పాయింట్లకు పైగా నష్టంతో 76,286 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 6,200 పాయింట్ల పైగా క్షీణించి 70,234 వద్ద కనిష్ఠానికి దిగజారింది. తుదకు 4,390 పాయింట్లు లేదా 5.74 శాతం పతనంతో 72,079కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,379 పాయింట్లు లేదా 5.93 శాతం నష్టంతో 21,884 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో దాదాపు 1,900 పాయింట్ల మేర పతనమై 21,281 కనిష్టానికి పడిపోయింది. ఫలితం చూస్తుండగానే బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 29.9 లక్షల కోట్లు హరించుకుపోయి.. రూ.39.6 లక్షల కోట్లకు పరిమితమయ్యింది.
3,340 స్టాక్స్‌ 25 శాతం క్షీణత
సెన్సెక్స్‌-30 సూచీలో ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ సూచీలు 6 శాతం నుంచి 15 శాతం వరకు పతనమయ్యాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో స్థిరపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు సైతం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 12 శాతం వరకు నష్టపోగా.. తుదకు 8 శాతం పతనంతో ముగిశాయి. బిఎస్‌ఇలో 3,340 స్టాక్స్‌ ఏకంగా 25 శాతం మేర క్షీణించాయి. కేవలం 498 స్టాక్స్‌్‌ మాత్రమే స్వల్ప లాభాలను నమోదు చేశాయి. 694 స్టాక్స్‌ లోహర సర్క్కూట్‌ను తాకాగా.. 292 స్టాక్స్‌ 52 వారాల కనిష్టానికి దిగజారగా.. మరో 100 స్టాక్స్‌ యథాతథంగా నమోదయ్యాయి. అన్ని రంగాలు నష్టాలు చవి చూశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్‌ సూచీ 8 శాతం, రియాల్టీ 9.6 శాతం, బ్యాంకింగ్‌ 15 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 11.8 శాతం, లోహ సూచీ 10.6 శాతం చొప్పున క్షీణించాయి.
బీజేపీ అనుకూల మీడియా సంస్థలు, ఎజెన్సీల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వాస్తవ ఫలితాలకు, ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉండటం మార్కెట్లలో ఆందోళనలు రేపాయని బ్రోకర్లు పేర్కొన్నారు. ఎన్డీఏకు 350 మేర స్థానాలు రావొచ్చనే అంచనాలు వాస్తవ రూపంలో 300 కూడా దాటకపోయే సారికి అమ్మకాల ఒత్తిడితో సూచీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయని విశ్లేషించారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మించి ఇండియా కూటమి మెరుగైన ఫలితాలను సాధించడం విశేషం.
కుప్పకూలిన అదానీ, అంబానీ స్టాక్స్‌
మార్కెట్ల కల్లోలంలో అదానీ, అంబానీ స్టాక్స్‌ కుప్పకూలాయి. అదానీ గ్రూపులోని కీలక కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 19.62 శాతం పతనమై రూ.2,930కి పడిపోగా.. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ స్టాక్‌ 21 శాతం నష్టపోయి రూ.1,251 వద్ద పరిమితమయ్యింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 7.5 శాతం పతనమయ్యింది. రిలయన్స్‌ సూచీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద రూ.1.27 లక్షలు తుడుచుకు పెట్టుకుపోయింది. జూన్‌ 3న బీఎస్‌ఈలో రిల్‌ షేర్‌ రూ.3,029కు చేరి.. 20.44 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ నమోదు చేసింది. తాజాగా ఇది రూ.18.99 లక్షల కోట్లకు పడిపోయింది.

Spread the love