– కలెక్టర్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లిన దళితులు
– ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి
– చేతులెత్తేసిన కార్యాలయ సిబ్బంది
– డీఎస్పీ, సీఐ జోక్యంతో పరిస్థితి అదుపులోకి
నవతెలంగాణ – మెదక్
పల్లెల్లో మొదలైన దళిత లొల్లి కలెక్టరేట్ వరకు చేరింది. రెండు కులాల మధ్య ఏర్పడిన వివాదం కలెక్టర్ ఛాంబర్‌లోకి దూసుకుపోయే పరిస్థితి నెలకొంది. వందల సంఖ్యలో తరలివచ్చిన దళితుల ను అడ్డుకోలేక కార్యాలయ సిబ్బంది చేతులెత్తేశారు. ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిన ఈ ఘటన పోలీసుల జోక్యంతో అదుపులోకి వచ్చింది. గురు వారం సాయంత్రం మెదక్ కలెక్టరేట్‌లోకి వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామానికి చెందిన దళితులు పెద్ద సంఖ్యలో చేరుకొని దళితబంధు కోసం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాలనుకున్నారు. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన బైరూపులు, బుడుగ జంగాల ప్రజలు తమకు సంబంధించిన సంఘ నాయకులతో కలిసి దళిత బందు కోసం కలెక్టరేట్వకు వచ్చారు. మాల, మాదిగ కులానికి చెందిన వర్గం చూస్తుండగానే బుడగ జంగాల సంఘం నాయకులు కలెక్టర్ ఛాంబర్ లోకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళడం జరిగింది. దీంతో ఆగ్రహించిన ప్రత్యర్థి వర్గం పెద్ద సంఖ్యలో కలెక్టర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లారు. ఆ దాటికి అక్కడ ఉన్న సెక్యూరిటీ, సిబ్బంది డోర్ లను మూసివేశారు. ఛాంబర్ బయట బైఠాయించి ఆందోళన చేపట్టగా సమాచారం అందుకున్న డీఎస్పి ఫణీంద్ర, సీఐ లు, పోలీసు సిబ్బంది ఆందోళన కారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపు చేశారు.
మేమే అసలైన దలితులం
మాది వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామం. మా గ్రామంలో మాల, మాదిగ కులాలకు చెందిన అసలైన దళితులము తామే అని తెలిపారు. గ్రామంలోని బైరూప్ లురు, బుడుగు జంగాలు క్రిస్టియన్ మిషనరీ లో కలిసి దళితులమంటూ దళిత బందు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ప్రశ్నించినందుకు దాడి చేశారన్నారు. నిజమైన దళితులమైన తమకు న్యాయం చేయాలని, బుడుగ జంగాలకు ఉన్న ఎస్సీ సర్టిఫికెట్ ను క్యాన్సల్ చేయాలని డిమాండ్ చేశారు.
దాడికి పాల్పడుతున్న మాల మాదిగలు
కుకునూర్ గ్రామంలోని బుడగ జంగాలపై మాల మాదిగ కులస్తులు దళిత బంధు కోసం దాడికి పాల్పడుతున్నట్లు బెడ బుడుగా జంగం రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం తెలిపారు. దళితబంధులో 50 కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఆ గ్రామంలో పరస్పరం కేసులు పెట్టారని తెలిపారు. దాడుల్లో ప్రాణాలు పోతే బాధ్యతా ఎవరు వహిస్తారనే ఉద్దేశ్యంతో కలెక్టర్ ను కలిసేందుకు రావడం జరిగిందన్నారు. కలెక్టరేట్ లో సైతం వందల మంది దళిత బందు కోసం వచ్చి దాడులు చేస్తున్నారన్నారు. ఆయనతో బుడుగ జంగాల నాయకులు మోహన్, అశోక్, బుజంఘం, సీతారాం, నర్సింలు డిగ్రీ, సుధాకర్, శివరాములు, రమేష్ ఉన్నారు.