నవతెలంగాణ-ఖమ్మం రూరల్
పాలేరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు పథకం వర్తింపజేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కెవిపిఎస్) రాష్ట్ర కమిటీ సభ్యులు పాపిట్ల సత్యనారాయణ అన్నారు.మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్ లో కెవిపిఎస్ ఖమ్మం రూరల్ మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు కుక్కల సైదులు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాపిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఎస్సీ కుటుంబానికి పార్టీలకు అతీతంగా దళిత బంధు అందించాలన్నారు. కెవిపిఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 215 దళిత వాడల్లో దళితుల స్థితిగతులపై సర్వే నిర్వహించడం జరిగిందని,ఈ సర్వేలో ప్రధానంగా దళితులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురై అత్యంత దుర్భరంగా జీవిస్తున్నారని సర్వేలో నిర్ధారణ చేయడం జరిగిందన్నారు. దళిత బంధు పథకాన్ని రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే, మంత్రుల సిఫారసులు లేకుండా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో సర్వే చేయించి నిజమైన లబ్ధిదారులకు అందిస్తే దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. జీవో నెంబర్ 342 ప్రకారం 100 యూనిట్ల ఉచిత విద్యుత్ నియోజకవర్గంలో ఎక్కడ అమలు కావటం లేదని,ఎస్సీ కార్పొరేషన్ సబ్ ప్లాన్ నిధుల నుంచి ట్రాన్స్కోకు నిధులు వెళ్తున్న పేద దళితుల నుండి యధావిధిగా విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కెవిపిఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు అక్టోబర్ రెండున పాలేరు నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలని సభ్యులకు సూచించారు.ఈ సమావేశంలో కెవిపిఎస్ ఖమ్మం రూరల్ మండల ఉపాధ్యక్షులు అరేంపుల ఉప్పలయ్య, మండల కమిటీ సభ్యులు వెలుతూరి రామనాధం, పాల్గొన్నారు.