దళిత మహిళ వివస్త్ర ఘటన.. నిందితుల అరెస్టు

ఎస్పీ మలికా గార్గ్‌
ఎస్పీ మలికా గార్గ్‌

నవతెలంగాణ విజయవాడ: ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో దళిత మహిళపై జరిగిన దాడి ప్రణాళిక ప్రకారమే జరిగిందని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ వెల్లడించారు. ఈ ఘటనపై ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలు తెలిపారు.
‘‘దర్శి మండలం బొట్లపాలెంలో గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి, పున్నమ్మల కుమార్తె భార్గవి, అదే గ్రామం దళిత వర్గానికి చెందిన సాయిరాం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ వేరే ప్రాంతంలో ఉండటం వల్ల వీరి ఆచూకీ కోసం యువతి తండ్రి బ్రహ్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. అదే గ్రామంలో నివాసం ఉంటున్న సాయిరాం సోదరి మౌనికకు.. వీరి ప్రేమ వ్యవహరం తెలుసునని, భార్గవి ఎక్కడ ఉందో సమాచారం తెలిసి ఉంటుందని భావించి ఆమెపై కోపం పెంచుకున్నారు. ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తరువాత నీళ్లు పట్టుకోడానికి కుళాయి వద్దకు మౌనివ వెళ్లింది. అదే సమయంలో అప్పటికే అక్కడకు చేరుకున్న బ్రహ్మారెడ్డి, పున్నమ్మ ఆమెను అపహరించి, వారి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ మౌనికను ఇనుప రాడ్లతో బలంగా కోట్టారు. కాళ్లు, చేతులు కట్టిపడేసి దాడి చేశారు. చివరకు పెట్రోల్‌ పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో మౌనిక తల్లి అనురాధ డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే దర్శి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మౌనికను కాపాడి ఆస్పత్రికి తరలించారు. మౌనికకు పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నాం. దాడికి పాల్పడిన బ్రహ్మారెడ్డి, పున్నమ్మలను అరెస్టు చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.

Spread the love