నవతెలంగాణ – గన్నేరువరం: మండలంలోని మాదాపూర్ గ్రామంలో గృహలక్ష్మిలో తమ పేరు రాలేదంటూ మంగళవారం ఎస్సీ కాలనీలో దళిత మహిళలు నిరసన చేపట్టారు. గృహలక్ష్మి పథకం ఎంపికలో సగం మందికి పైగా సొంత ఇండ్లు 5, 10ఎకరాల పైన భూములు ఉన్న వారిని ఎంపిక చేశారన్నారు. మరికొందరు కొత్త ఇండ్లు కట్టుకొని గహప్రవేశం చేశారని అలాంటి వారికి కూడా గృహలక్ష్మి పథకం అమలు చేశారని వాపోయారు. తాటికమ్మల గుడిలో నివసిస్తున్న తమలాంటి వారికి పథకానికి ఎంపిక చేయకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే గృహలక్ష్మి పథకంలో పేరు వచ్చిందని మండిపడ్డారు. గృహలక్ష్మి ఎంపికపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫైనల్ చేసిన లిస్టును రద్దుచేసి మళ్లీ గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంపతి పోచవ్వ, సంపతి రమ్య, నవుండ్ల చంద్రయ్య, సంపతి కోమల, సంపతి అరుణ, సంపతి ఉదరు, లింగయ్య, సంపతి శ్రీనివాస్, సంపతి సంపత్, సంపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.