వాగ్దాన అమలుకే దల్లేవాల్‌ దీక్ష

Dallewal initiation is the implementation of the promise– కనీస గిట్టుబాటు ధర హామీని విస్మరించిన కేంద్రం
– కస్తూర్భా ఉద్యోగుల సమ్మెను విచ్చిన్నం చేసే కుట్ర
– జిమ్మిక్కుల కోసమే సావిత్రీబాయి జయంతిని ఉమెన్స్‌ టీచర్స్‌డేగా ప్రకటన
– ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగితే విచారించి చర్యలు తీసుకోవాలి : విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిది
నల్ల చట్టాల్ని రద్దు చేయాలని 2022లో జరిగిన రైతు ఉద్యమం సందర్భంగా కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు చట్టం చేస్తామని ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించినందునే రైతు నాయకుడు దల్లేవాల్‌ దీక్ష చేపట్టారని, ఆ దీక్షను మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేవల్‌ కిషన్‌ భవన్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని రైతు ప్రతినిధులు అనేక సార్లు చర్చలు, సంప్రదింపులు జరిపినా కేంద్రం పట్టించుకోలేదని, అందుకే దలేవాల్‌ దీక్ష చేపట్టారని తెలిపారు. దలేవాల్‌ దీక్ష చేయడాన్ని సుప్రీం కోర్టు సైతం సమర్ధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధరల చట్టం తీసుకువచ్చేందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ స్వార్ధంతో పాటు ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందడం, రాష్ట్రాల అధికారాలు, స్థానిక సమస్యలు చర్చకు రాకుండా ఉండేందుకు ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ పేరిట బీజేపీ ఆర్భాటం చేస్తోందన్నారు. పార్లమెంట్‌లో 2/3 మెజార్టీ లేకపోయినా బిల్లు పాస్‌ కాదన్న విషయం తెలిసినా హైలెట్‌ కావడం కోసమే బీజేపీ ప్లాన్‌ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో కేజీబీవీల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు 25 రోజులుగా చేస్తున్న సమ్మెను పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించకుండా సమ్మెను విచ్చిన్నం చేసేందుకు మంత్రులు కుట్రలు చేయడం సరికాదన్నారు. కస్తుర్బా పాఠశాలల్లో బాలికలకు విద్యనందిస్తున్న ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం.. జిమ్మిక్కుల కోసం మాత్రమే సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని ఆరోపించారు. ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగితే త్వరగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. .

Spread the love