దమనకాండ

 – రెజ్లర్లపై ఖాకీ జులుం
–  జాతీయ జెండాలను లాగిపడేసి అవమానపర్చిన పోలీసులు
– ఘర్షణ…తోపులాట ..శిబిరం తొలగింపు
– సరిహద్దు వద్ద తికాయత్‌ సహా పలువురు రైతుల అరెస్ట్‌
– ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు : వినేశ్‌ పోగట్‌
– పతకాలు తేవడమే నేరమా? : సాక్షి మాలిక్‌
– ఏం నేరం చేశాం? : బజరంగ్‌ పునియా
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ పై చర్య తీసుకోవాలని 36 రోజుల నుంచి పలురూపాల్లో ఆందోళన చేస్తున్నా…ప్రధాని మోడీ మాత్రం ఇంతవరకూ నోరు మెదపలేదు. ఆ ఆడబిడ్డలకు భరోసా ఇవ్వలేదు. పైగా పార్లమెంట్‌ ప్రారంభోత్సవంలో నిందితుడు బ్రిజ్‌ భూషణ్‌ ప్రత్యక్షమవ్వగా..పార్లమెంట్‌ వెలుపల బాధిత రెజ్లర్లపై మోడీప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఓవైపు ప్రజాస్వామ్యం అంటూ ప్రధాని ప్రవచిస్తుండగానే.. మరో వైపు ఆడబిడ్డల శాంతియుత నిరసనలపై బీజేపీ సర్కార్‌ అప్రజాస్వామికంగా అణచివేతకు పాల్పడింది.ఈ బరితెగింపుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

న్యూఢిల్లీ : మహిళా మల్ల యోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం జంతర్‌మంతర్‌ నుంచి నూతన పార్లమెంట్‌ భవనం వద్దకు ప్రదర్శనగా వెళుతున్న వేలాది మంది మహిళలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వారిని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి బస్సుల్లో ఎత్తి పడేశారు. అనంతరం వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. రెజ్లర్ల శిబిరాన్ని నామరూపాలు లేకుండా తొలగించారు. పోలీసుల దౌర్జన్యకాండపై రెజ్లర్లు మండిపడ్డారు. న్యాయం కోసం పోరాడుతున్న తమకు అన్యాయం చేస్తారా అంటూ నిలదీశారు.ఈ దమ నకాండను పలువురు నేతలు ప్ర‌జాస్వామ్యవాదులు ఖండించారు.
వేలాదిమంది మహిళలు మద్దతుగా తరలిరాగా న్యాయం కోసం డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు ముందుకు సాగారు.

      పార్లమెంట్‌ భవనం వైపు సాగుతున్న నిరసనకారులకు, పోలీసు లకు మధ్య ఘర్షణ, తోపులాట జరిగాయి. ఒక దశలో రెజ్లర్లు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, భద్రతా వలయాన్ని ఛేదించుకొని ముందుకు వెళుతున్న ఒలింపిక్‌ పతక విజేతలు బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత వినేష్‌ పోగట్‌,సంగీతా పోగట్‌ సహా పలువురు రెజ్లర్లను పోలీసులు నిర్బంధించారు. ఆ సమయంలో వినేష్‌ తీవ్రంగా ప్రతిఘటించారు. మరోవైపు ఆమెకు రక్షణగా సంగీత కొద్దిసేపు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. చివరికి పోలీసులు ఆందోళనకారులను ఈడ్చికెళ్లి బస్సులలో ఎక్కించారు. పోలీసుల దుశ్చర్యపై రెజ్లర్లు మండిపడ్డారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ వినేష్‌ పోగట్‌ నిప్పులు చెరిగారు. ఒకవైపు ప్రధాని మోడీ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభిస్తుంటే మరోవైపు తమకు మద్దతుగా వచ్చిన వారిపై పోలీసులు దాష్టీకం చెలాయించారని విమర్శించారు. పార్లమెంటుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆమెను అడ్డుకొని బస్సులో తరలిస్తుండగా ‘కొత్త దేశానికి అభినందనలు’ అంటూ నినదించారు. జంతర్‌మంతర్‌ వద్ద నెల రోజులుగా జరుగుతున్న ఆందోళనను అణగదొక్కేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సాక్షి మాలిక్‌ ధ్వజమెత్తారు. భారతీయ క్రీడల చరిత్రలో ఇది విచారకరమైన రోజని ఆమె వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన గూండా బ్రిజ్‌ భూషణ్‌ పార్లమెంటులో కూర్చుంటే దేశం కోసం పతకాలు సాధించిన తమను రోడ్లపై ఈడ్చుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన ఛాంపియన్ల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. మమ్మల్ని ఈ ప్రపంచమంతా చూస్తోంది. దేశానికి పతకాలు తేవడమే నేరమా? అయితే మమ్మల్ని ఉరితీయండి’ అని అన్నారు. ‘మేము శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తుంటే మహిళలు అని కూడా చూడకుండా ఎలా దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. న్యాయం కోసం పోరాడుతుంటే మాకు తీవ్రమైన అన్యాయం చేశారు’ అని ఒలింపియన్‌ బజరంగ్‌ పునియా విలేకరులతో అన్నారు. రెండు వేల మంది మద్దతుదారులను పోలీసులు నిర్బంధించారని, ఎక్కడ చూసినా నియంతృత్వం కొనసాగుతోందని విమర్శించారు. ‘ఏ ప్రభుత్వమైనా దేశ ఛాంపియన్లను ఇలా చూస్తుందా? మేము ఏం నేరం చేశాం?’ అని ప్రశ్నించారు. పోలీసులు చెదరగొడుతుండగా సాక్షి మాలిక్‌ భర్త, రెజ్లర్‌ సత్యవ్రత్‌ కడియన్‌, మరో రెజ్లర్‌ జితేందర్‌ కిన్హాలు ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు రెజ్లర్లను అరెస్ట్‌ చేసి తొమ్మిది బస్సులలో వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. బజరంగ్‌ను మయూర్‌ విహార్‌ సమీపంలోనూ, సాక్షిని బురారీలోనూ, వినేష్‌, సంగీతలను కల్కాజీలోనూ పోలీస్‌ స్టేషన్లలో ఉంచారు. కొందరు ఆందోళనకారులను తిక్రీ సరిహద్దు వైపుకు తరలించారని తెలిసింది. రెజ్లర్ల శిబిరం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, హోర్డింగులు, టార్పాలిన్‌ పట్టాలు, వెదురు కర్రలు, తాళ్లు, ఇతర సామగ్రిని పోలీసులు తొలగించారు. ఆ ప్రదేశాన్ని మొత్తం ఖాళీ చేయించారు. అంతేకాదు… శిబిరం వద్ద ఉన్న మువ్వన్నెల జెండాను కూడా తీసేశారు. రెజ్లర్లు ఉపయోగించిన మంచాలు, పరుపులను సైతం బయటికి తరలించారు. శాంతిభద్రతలను కాపాడేందుకే రెజ్లర్లను అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో వేలాది మంది పోలీసులను మోహరించారు. పలు ప్రాంతాలలో బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌ సహా ఢిల్లీ సరిహద్దులలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిలోనూ, సరిహద్దు ప్రాంతాలలోనూ గస్తీని ముమ్మరం చేశారు. రెజ్లర్లకు మద్దతుగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్‌ తికాయత్‌, పలువురు రైతులు ఘజియాబాద్‌ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. అయితే వారిని నగరంలోకి అనుమతించలేదు. తాను జంతర్‌మంతర్‌ వైపు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, అయినప్పటికీ తమ నిరసన కొనసాగుతుందని తికాయత్‌ చెప్పారు. ఈ ఉద్యమం విజయవంతమైందని, తమ తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కాగా హర్యానా రాష్ట్ర బీకేయూ అధ్యక్షుడు గుర్నామ్‌ సింగ్‌ చదూనీ సహా పలువురు రైతు నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం రెజ్లర్లు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం వారు వేలాది మంది మద్దతుదారులతో కలిసి జంతర్‌మంతర్‌ నుండి ఇండియా గేట్‌ వరకూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 19న బంగ్లా సాహెబ్‌ గురుద్వారా వరకూ భారీ ప్రదర్శన జరిపారు. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీస్‌ ఇచ్చిన నేపథ్యంలో బ్రిజ్‌ భూషణ్‌పై గత నెల 28న రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యా తీసుకోలేదు. పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్రిజ్‌ భూషణ్‌ హాజరయ్యారు. ఆయన చివరి వరుసలో కూర్చొని ఇతర నేతలను పలకరిస్తూ కన్పించారు. అయితే చాలా మంది ఆయనను తప్పించుకొని తిరిగారు.
పోరాటం కొనసాగుతుంది: రెజ్లర్లు
పోలీసుల చర్యతో సమ్మె ముగియదని, జంతర్‌ మంతర్‌ వద్ద సత్యాగ్రహం కొనసాగుతుందని, భారత్‌ నిరంకుశ దేశం కాదని సాక్షి మాలిక్‌ పేర్కొన్నారు. రైతు సంఘాలు, ఖాప్‌ నేతలు త్వరలో సమ్మెను ప్రకటించనున్నారు. రెజ్లర్‌ భజరంగ్‌ పునియా మాట్లాడుతూ ‘మమ్మల్ని కాల్చండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెరపైకి సర్కారు వైఖరి : ఏచూరి

రెజ్లర్లపై పోలీసు చర్యను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. రెజ్లర్లను పోలీసులు తరలిస్తున్న ఒక వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. ఒకవైపు మోడీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండగా.. కొన్ని మీటర్ల దూరంలో అతని(మోడీ) ప్రభుత్వ నిజమైన, వికారమైన వైఖరి తెరపైకి వచ్చింది అని ఏచూరి అందులో పేర్కొన్నారు. అలాగే, కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం పైనా ఏచూరి ట్వీట్‌ చేశారు. ‘నవ భారతదేశం’ ప్రకటనతో ‘పెద్ద ప్రచారం’ మధ్య ప్రారంభోత్సవ వేడుక జరిగిందని ఆయన ఆరోపించారు. ”ఈ నవ భారత ప్రకటన భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, ప్రతిపక్ష పార్టీలు లేనప్పుడు వచ్చింది! భారతదేశం= దేశం మరియు పౌరుడు. కొత్త భారతదేశం రాజా మరియు ప్రజా” అని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

ప్రజల గొంతు నొక్కేస్తున్న ‘అహంకార రాజు’: రాహుల్‌

ఢిల్లీలోని జంతర్‌మం తర్‌ వద్ద నిరసన చేస్తున్న భారత రెజ్లర్లపై పోలీసు చర్య గురించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందిం చారు. రెజ్లర్లపై పోలీసు చర్యకు సంబంధించిన వీడియోను రాహుల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ” పట్టాభిషేకం ముగిసింది. ‘అహంకార రాజు’ వీధుల్లో ప్రజల గొంతును నలిపివేస్తున్నాడు” అని రాహుల్‌ హిందీలో రాసుకొచ్చారు. అయితే, అంతకముందు పార్లమెంటును మోడీ ప్రారంభించిన వెంటనే రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ”పార్లమెంటు అనేది ప్రజల గొంతు! ప్రధాని పార్లమెంటు హౌస్‌ ప్రారంభోత్సవాన్ని ఒక పట్టాభిషేకంలా పరిగణిస్తున్నారు” అని అందులో రాసుకొచ్చారు.
ఐద్వా ఖండన
మోడీ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేతను ఐద్వా తీవ్రంగా ఖండించింది. మహిళా సమ్మాన్‌ పంచాయితీకి వెళ్తున్న వారిని కొత్త పార్లమెంట్‌ భవనం వద్ద నిర్బంధించడం దాని నిరంకుశ ముఖాన్ని వెల్లడిస్తోందని పేర్కొంది. ఉద్యమానికి మద్దతుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న మల్లయోధులు, కార్యకర్తలందరికీ ఐద్వా సంఘీభావంగా నిలుస్తుందని తెలిపింది.
రెజ్లర్లకు 1,150కిపైగా ప్రముఖులు మద్దతు
గత 36 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు దేశంలోని ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ మేరకు 1,150కిపైగా మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, మాజీ సివిల్‌ సర్వీస్‌ అధికారులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు తదితరులు మద్దతు తెలిపారు.
రెజ్లర్లపై కేసులు..: భారత పార్లమెంట్‌ నూతన భవనం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
సిగ్గుచేటు : సీపీఐ(ఎం)
మోడీ ప్రభుత్వం చర్య సిగ్గుచేటని సీపీఐ(ఎం) పేర్కొంది. రెజ్లర్లు, ఐద్వా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని పేర్కొంది. ప్రజాస్వామ్యం అంటే గొప్ప భవనాలు, ఆడంబర ప్రసంగాలు కాదని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, స్వేచ్ఛలను గౌరవించడమని సీపీఐ(ఎం) పేర్కొంది. మోడీ ప్రభుత్వం కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించి ఉండవచ్చని, కానీ ఢిల్లీ పోలీసు లతో ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుందని తెలిపింది.
బ్లాక్‌ డే : ఎస్కేఎం
ప్రజాస్వామ్యానికే బ్లాక్‌ డే అని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం సిగ్గుచేటని విమర్శించింది. మల్లయోధులు, రైతులు, మహిళలపై నిరంకుశ దాడిని ఎస్కేఎం ఖండించింది. ప్రజాస్వామ్య నిరసనల అణచివేతను ఆపాలని, అరెస్టు చేసిన నిరసనకారులందరినీ విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఎస్కేఎం మద్దతుతో మహిళా రెజ్లర్లు పిలుపునిచ్చిన ప్రజాస్వామ్య నిరసనను అడ్డుకోవడానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని పిరికి బీజేపీ ప్రభుత్వం సరిహద్దులను మూసివేసిందని విమర్శించారు. చాలా మంది కార్యకర్తలను అరెస్టు చేసింది. అనేక మందిని గృహ నిర్బంధంలో ఉంచింది. రైతులు, మహిళలు ఢిల్లీకి రాకుండా సరిహద్దులు మూసేశారని విమర్శించారు. ఇది బీజేపీ మహిళా వ్యతిరేక, అప్రజాస్వామిక స్వభావాన్ని బహిర్గతం చేస్తుందని, లైంగిక వేధింపుల ఆరోపణలకు గురైన వ్యక్తులను రక్షించడానికి వారు ఎంత నీచంగా దిగారని విమర్శించింది. ఇది ప్రధాని బేటీ బచావో నినాదాన్ని ఎత్తి చూపుతుందని ధ్వజమెత్తారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి శిక్షించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని, మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎస్కేఎం హెచ్చరించింది.

Spread the love