నవతెలంగాణ- అమరావతి: బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన ప్రమాదంలో నృత్యకారిణి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఏపీలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు చప్టా సమీపంలో ఇది జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. రొంపిచర్లలో సోమవారం రాత్రి బీసీ కాలనీలోని వినాయకుడి మండపం వద్ద నరసరావుపేటకి చెందిన సోనీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. నర్సంపేటకు చెందిన ఎం.అశ్విని డ్యాన్స్ చేసేందుకు వచ్చింది. కార్యక్రమం తర్వాత ఆమె పట్టణానికి చెందిన మున్నా అనే యువకుడి ద్విచక్ర వాహనంపై నరసరావుపేట బయలుదేరింది. ఈ తరుణలో తుంగపాడు చప్టా సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ స్తంభాన్ని ఢీకొంది. వెనుక కూర్చున్న అశ్విని రోడ్డు పక్కన కాలువలో పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిగా మున్నాకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకొని కాలువలో పడిన అశ్విని మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం స్థానిక ఏరియా అస్పత్రికి తరలించారు. మున్నాను వైద్యశాలకు తరలించారు. యువతి అశ్విని తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరానికి చెందినవారుగా గుర్తించారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌కుమార్ తెలిపారు.