– మేలో ”సకల కళల నృత్య సమ్మేళనం” : టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – ముషీరాబాద్
నాట్య కళలు సాంస్కృతిక వికాసానికి పాదులు.. నాగరికతకు చిరునామాలని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. టీపీఎస్‌కే ఆధ్యర్యంలో భారతీయ నృత్య గురువుల సమావేశం మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చినుకు కల్చరల్ సొసైటీ అధ్యక్షులు పీఎన్ మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశం భారతీయ నృత్యాలన్నిటినీ ఒకే వేదిక మీద ప్రదర్శించి సార్వత్రికతను చాటడం కోసమన్నారు. సామాజిక సాంస్కృతిక అంతరాలు, అడ్డంకులు దాటి సకల కళలు సామాన్యులకు దగ్గర చేసేందుకని అన్నారు. నృత్య గురువులను, శాస్త్రీయ నృత్యకారులను ఏకం చేయడం, ప్రజలకు, పిల్లలకు మంచి విలువలను అందించడం ఈ సకల కళల సమ్మేళనం ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. నాట్యం గొప్ప శాస్త్రమని.. అది ఒక సముద్రం లాంటిదని అన్నారు. దాన్ని విశ్వ వ్యాపితం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో టీపీఎస్‌కే ఆధ్వర్యంలో ”సకల కళల నృత్య సమ్మేళనం” కార్యక్రమాన్ని మే మూడో వారంలో సుందరయ్య కళా నిలయంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మూర్తి మాట్లాడుతూ.. భారతీయ నృత్య రూపాలైన కథక్, కథాకళి, కూచిపూడి, భరతనాట్యం, మణిపూరి, మోహిని హట్టం, ఒడిస్సీ సత్రియ పేరిణి, శివతాండవం, ఘామాల్ బిహు, కోలాటం, పీర్ల పండుగ ఇలా అనేక కళారూపాలు ఒకే వేదిక మీద ప్రదర్శించడం గొప్ప అవకాశంగా గురువులు భావిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంగీతం నృత్య గురువులు వరుణ్, కృష్ణ, పవన్, లావణ్య, యోగా టీచర్ రాధిక, శ్రీనివాస్, కూచిపూడి కె.రమాదేవి, భరతనాట్యం పి.లక్ష్మీదేవి, కోలాటం గురువు అచ్చుతాంబ, సౌజన్య, నృత్య గురువు నిఖిలేష్, వెస్ట్రన్ డ్యాన్స్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.