– ఒకరు మృతి, మరొకరికి గాయాలు
నవతెలంగాణ కొత్తూరు
నాట్కో పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేక గూడా గ్రామ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంజర్ల గ్రామానికి చెందిన రవి (19) అదే గ్రామానికి చెందిన అర్బాజ్ అనే కాంట్రాక్టర్ వద్ద రెండు నెలలుగా నాట్కో పరిశ్రమలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం విధుల్లో ఉండగా బూమ్ లైట్ యంత్రంలో ఆయిల్ లీకేజీ ఉండటంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కాంట్రాక్టర్ నిర్లక్షంగా మరమ్మత్తులు చేయిస్తుండగా ఒక్కసారిగా యంత్రం పై నుంచి అతనిపై పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రవి మృతిచెందాడు. గాయాలైన మరో వ్యక్తి.. మహేష్ ప్రస్తుతం స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుని తల్లి వీర్లపల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.