– నిబంధనలు, నిర్వహణ వదిలేసిన జీహెచ్‌ఎంసీ
– ప్రమాదకరంగా విద్యుత్ తీగలు, కరెంటు మీటర్లు
– బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కుకు పెరుగుతున్న సందర్శకులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రకృతిని తలపించేలా విహారం.. వినోదం.. మరపురాని అనుభూతులకు పార్కులు నిలయాలు. పోటీ ప్రపంచంలో కాలంతో పోటీ పడుతూ క్షణం తీరిక లేకుండా ఉద్యోగ, వ్యాపారాలు, వివిధ పనుల్లో బిజీగా గడిపే వారంతా ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలతో కాసేపు పార్కుల్లో సేద తీరుతున్నారు. పిల్లలనే కాదు.. పెద్దలనూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా పార్కులు ఆకట్టుకుంటున్నాయి. అయితే, హైదరాబాద్ నగరంలో కాంక్రిట్ జంగిల్ విస్తరిస్తున్న తరుణంలో పార్కులు కనుమరుగవుతున్నాయి. అలాగే ఉన్న పార్కుల్లో సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారుతున్నాయి. మరికొన్ని ప్రమాదకరంగా మారుతున్నాయి. దాంతో వాకింగ్ చేసేవారితోపాటు ఆహ్లాదం కోసం పిల్లాపాపలతో కలిసి వచ్చేవారికి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
పిల్లల కేరింతలు
హైదరాబాద్‌లోని రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 0.2 మైల్స్ (481స్టెప్స్), చుట్టూ 360 డిగ్రీ వ్యూతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కు ఆహ్లాదాన్ని పంచే మొక్కలతోపాటు ట్రాక్‌లు, చుట్టూ పచ్చని చెట్లు, పూలమొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పార్కు ముందుభాగంలో టీ స్టాల్స్, తినుబండారాల దుకాణాలు, చిరు వ్యాపారుల సందడితో నిత్యం ఈ ప్రాంతం కిక్కిరిసిపోతోంది.
చుట్టపక్కల ఒక్కటే పార్కు
సుందరయ్య పార్కు బాగ్‌లింగంపల్లి, వీఎస్‌టీ, అచ్చయ్యనగర్, ఆజామాబాద్, చిక్కడపల్లి, నాగమయ్యకుంట, రాంనగర్, విద్యానగర్ వాసులను విశేషంగా ఆకర్షిస్తున్నది. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు, వృద్ధులు వాకింగ్ చేయడానికి, యువత వామప్ చేయడానికి ప్రతిరోజూ పార్కును ఆశ్రయిస్తున్నారు. పక్కనే సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉండటంతో ప్రతి రోజూ సదస్సులు, సభలు, సెమినార్లు జరుగుతుంటాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వివిధ సమస్యలపై ఆందోళనలకు పిలుపునిచ్చేవారూ పార్కు నుంచే బయలుదేరతారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అప్పుడప్పుడు సభలకు హాజరవుతూ ఉంటారు. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పార్కులోకి అనుమతిస్తారు. ముఖ్యంగా ఆదివారం ఆటవిడుపుగా సందర్శకులతో పార్కు రద్దీగా ఉంటోంది.
అసలే వర్షాకాలం..
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పార్కు అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో ప్రమాదకరంగా మారింది. పార్కులోని చెట్లను కొట్టేసిన సిబ్బంది అక్కడే వదిలేశారు. మరో చెట్టుకు విద్యుత్ తీగలను చుట్టేయడం, కరెంట్ మీటర్లు, వైర్లు బయటే ఉంచడం ప్రమాదకరంగా తయారైంది. అసలే వర్షాకాలం విద్యుత్ మీటర్లకు రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. పార్కు మధ్యలో ఏర్పాటు చేసిన హైమాక్స్‌లైట్స్ (విద్యుత్ స్థంభం) ప్రమాదకరంగా మారింది. స్థంభానికి ప్రమాద హెచ్చరిక ఉన్నా అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. పార్కులో ఆడుకుంటున్న చిన్నారులు పొరపాటున అక్కడి వెళ్తే ప్రాణాలకు ముప్పుతప్పదు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సందర్శకులు, వాకర్స్, పిల్లల్ల తల్లిదండ్రులతోపాటు స్థానికులు కోరుతున్నారు.
ఆశించినంత అభివృద్ధి లేదు :రమేష్, రాంనగర్
కుటుంబసభ్యులతో కలిసి వీకెండ్‌లో రాంనగర్ నుంచి సుందరయ్యపార్కుకు వస్తాం. సుందరయ్యపార్కు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. అయితే జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఆశించినంత తీరులో అభివృద్ధి లేదు. పార్కును అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరంలోనే ది బెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చిన రాజకీయ నాయకులు,
అధికారులు పట్టించుకోవడం లేదు. పబ్లిక్ సేఫ్టీకి చర్యలు తీసుకోవాలి : ఎం.శ్రీనివాస్
జీహెచ్‌ఎంసీ అధికారులతోపాటు విద్యుత్, తదితర శాఖలకు చెందిన అధికారులు పబ్లిక్ సేఫ్టీకి అన్ని చర్యలు తీసుకోవాలి. అధికారులు నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాలి. సుందరయ్య పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోంది. రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నారు. పార్కింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. ప్రత్యేక పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలి.
– గ్రేటర్ హైదరాబాద్, సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి, సీపీఐ(ఎం)