ఫ్రెంచ్‌ దురాక్రమణ ప్రమాదం

Danger of French aggression– సహేల్‌ ప్రాంత దేశాల కూటమి ఒప్పందం
సహేల్‌ : పశ్చిమ ఆఫ్రికాలో నిజర్‌, మాలి, బర్కీనా ఫాసో ఈ నెల 16న సహేల్‌ ప్రాంత దేశాల కూటమి (ఏఇఎస్‌) ఒక రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ మూడు దేశాల అధినేతలైన మాలి అధ్యక్షుడు అస్సిమి గోయిత్రా, బర్కీనా ఫాసో అధ్యక్షుడు ఇబ్రాయిమ్‌ ట్రావోర్‌, నిజర్‌ అధ్యక్షుడు మాలి రాజధాని బమాకోలో సమావేశమై ఈ రక్షణ ఒప్పందంపైన సంతకాలు చేశారు. ఈ రక్షణ ఒప్పందం సమిష్టి భద్రత కోసం, ప్రజల అవసరాల కోసం పరస్పర సహాయ, సహకారాలను ఇచ్చిపుచ్చుకోవాటానికి కావలసిన నిర్మాణాలను రూపొందిస్తుంది. ఈ ఒప్పందంలో భాగస్వాములైన దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా… అది అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించటం జరుగుతుంది. ఫ్రాన్స్‌ మద్దతుగల పొరుగునవున్న పశ్చిమ ఆఫ్రికా ఎకనమిక్‌ కమ్యునిటీ(ఇకోవాస్‌) దేశాలతో ఈ ఏఈఎస్‌ దేశాలకు ప్రమాదం పొంచివున్నదనే భయంతో ఈ దేశాలు ఇటువంటి ఒప్పందాన్ని చేసుకోవలసి వచ్చింది. ఈ మూడు దేశాలు ఫ్రెంచ్‌ వలస దేశాలుగా ఉండేవి. మాలీలో ఒక దశాబ్దంపాటు ఫ్రెంచ్‌ చేసిన యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలలో రక్తపాతం జరిగింది. ఇకోవాస్‌ దేశాలైన నైజీరియా, ఐవొరీ కోస్ట్‌, ఘనా, టోగోల సైనిక జోక్యానికి తన మద్దతు ఉంటుందని ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ లో జరుగుతున్న నాటో-రష్యా యుద్ధం ఆఫ్రికాకు విస్తరించే ప్రమాదం ఉందని ఏఇఎస్‌ ఒప్పందం పేర్కొంది. ఫ్రాన్స్‌ తో సంబంధాలు తెగిపోయిన తరువాత ఏఈఎస్‌ దేశాలు రష్యాతోను, రష్య దన్నుతో ఏర్పడిన వాగర్‌ సైనిక గ్రూపుతోను సైనిక సంబంధాలను పెట్టుకోవటానికి ఆసక్తి చూపాయి. ఏఈఎస్‌- ఇకోవాస్‌ దేశాల మధ్య యుద్ధం సంభవించటానికి అంతర్జాతీయంగా ఫ్రెంచ్‌ భాగమైన నాటో కూటమికి, రష్యాకు మధ్య ఉక్రెయిన్‌ లో జరుగుతున్న యుద్ధం కారణమయ్యే అవకాశం ఉంది. నిజర్‌లో సైనిక తిరుగుబాటు జులై 26న జరిగింది. అప్పటిదాకావున్న ఫ్రెంచ్‌ అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి నిజర్‌ లో సైనిక ప్రభుత్వం ఏర్పడింది. నూతనంగా అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం ఆగస్టు కల్లా ఫ్రెంచ్‌ సైన్యాన్ని, ఫ్రెంచ్‌ రాయభారిని దేశం విడిచిపోవాలని ఆదేశించింది. ఇందుకు ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ తన నయావలసవాద దురహంకారంతో తిరస్కరించటమే కాకుండా నిజర్‌ ప్రభుత్వాన్ని గుర్తించటానికి కూడా నిరాకరించాడు. నిజర్‌ లో ఫ్రెంచ్‌, నాటో సైన్యాలు తిష్టవేయటానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇందుకు ప్రతిస్పందనగా ఫ్రాన్స్‌ నిజర్‌, బర్కీనా పాసో, మాలీ దేశాల సైనిక పాలకులను పదవీచ్యుతులను చేయటానికి పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌, ఐవొరీ కోస్ట్‌, సెనెగల్‌ దేశాలకు సైన్యాన్ని, సైనిక సామాగ్రిని పంపిందని నిజర్‌ మిలిటరీ పాలకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏఈఎస్‌ దేశాలు సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాయి.

Spread the love