– మోడీని నిలువరించడం కాంగ్రెస్‌కే సాధ్యం
– వంద లక్షల కోట్ల అప్పును మిగిల్చిన ఘనుడాయన
– తమకు పోటీగా బీజేపీ మాత్రమే ఉండాలనే ఆరాటంలో బీఆర్‌ఎస్
– కాంగ్రెస్, కమలం ఒక్కటే అనడం సిగ్గుమాలిన చర్య
– ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో పార్లమెంటు ఎన్నికల శంఖారావం
– ఎంపీ అభ్యర్థులను నిర్ణయించే అధికారం ఖర్గేకు అప్పగిస్తూ టీపీసీసీ తీర్మానం
– మార్చి 3 వరకు దరఖాస్తులు :టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో మోడీని నిలువరించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీతో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక రూ.100 లక్షల కోట్లు అప్పు చేసి, ప్రపంచంలోనే ఇండియాను దివాళాతీసే దేశంగా నిలబెట్టారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. తాజా రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు ఎన్నికలు, ప్రచారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఎంపీ అభ్యర్థులను నిర్ణయించే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు కట్టబెడుతూ సమావేశం తీర్మానం చేసింది. సోనియాగాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలనీ, ప్రజాస్వామికవాదులందరూ ఆమె ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరింది. ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రులు, సభ్యులు, తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని మోడీ నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా అమలు చేయకుండా పక్కన పడేశారని విమర్శించారు. ‘విభజన హామీలను అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ అడగలేదు… మోడీ అమలు చేయలేదు’ ఎద్దేవా చేశారు. గిరిజన యూనిర్సిటీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రతిపేదవాని బ్యాంకు ఖాతాల్లో రూ15 లక్షలు వేస్తామనీ, ప్రతిఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామనీ, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనీ, 2022 నాటికల్ల పేదవారికి పక్కా ఇండ్లు నిర్మిస్తామంటూ ఇలా అనేక హామీలు ఇచ్చిన బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడాన్ని పక్కనబెట్టి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రభుత్వాలను కూల్చడం వంటి చర్యలకు ఆ పార్టీ పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రపంచంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశంగా ఇండియా అవతరించడం మోడీ ఘనతేనని ఎద్దేవా చేశారు. రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ రికార్డు సృష్టించిందని అన్నారు. దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పులు మోపారని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరిగితే మోడీ అక్కడికి వెళ్లలేదని విమర్శించారు. ‘తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ సచ్చింది. దీనికి మనుగడ లేదు’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యయాంటూ బిల్లా-రంగాలు (కేటీఆర్, హరీశ్‌రావు) అంటున్నారని విమర్శించారు. బీజేపీ సిద్ధాంతంతో పోరాటం చేస్తున్న కాంగ్రెస్…. బీజేపీతో ఎలా స్నేహం చేస్తుందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్టేనన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలు నెరవేరుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు సాధించాలని పిలుపుని చ్చారు. కేసీఆర్ చీకట్లో ఖాళీగా లేడనీ, మోడీతో చీకటి చర్చలు జరుపుతు న్నారని విమర్శించారు. ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తు లను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. మార్చి 3 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలపారు. దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ వేసినట్టు తెలిపారు.
ఇంద్రవెల్లి నుంచే ఎన్నికల ప్రచారం
ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ నుంచి లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నామని రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 60 రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికల జరుగుతున్నాయని తెలిపారు. లోకసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు వచ్చే నెల 2 నుంచి సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వాటిని పెద్దఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఇన్‌చార్జిలను నియమించామని తెలిపారు. నియోజక వర్గాల వారీగా సభలు నిర్వహించి ముందుకు పోవాలని కోరారు. ఎమ్మెల్యేలు ఎవరు అడిగినా అప్పాయింట్‌మెంటు ఇస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు కూడా సమయమిస్తామని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. భారీ నీటిపారుదల శాఖపై కూడా బడ్జెట్ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ప్రజాగాయకులు గద్దర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చట్ట ప్రకారం విచారణ చేపడుతున్నాయని రేవంత్ వివరించారు.