– అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు
– విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని సూచిస్తున్న విద్యుత్ అధికారులు
నవతెలంగాణ-కొత్తూరు
వర్షాకాలం రానే వచ్చింది. ఓ పక్క రైతులు సంతోషపడుతున్న వర్షాలతో పాటు ప్రమాదాలు సైతం పొంచి ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు, విష జ్వరాలు, విష సర్పాలు గుంతకాడి నక్కల కాచుకొని ఉన్నాయి. వీటికి చిన్న, పెద్ద అంటూ తారతమ్యం ఏమీ లేదు. అందరూ జాగ్రత్త పడాల్సిందే. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రైతన్నలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గట్లళ్లలో, పొలాల్లో విష సర్పాలు కాచుకొని ఉంటాయి. విద్యుత్ షాక్‌లతో రైతన్నలు ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. చిన్నారులు పాఠశాలలకు వెళ్లే సమయంలో రోడ్డుపై ఉన్న స్తంభాలతో విద్యుత్ ప్రమాదాల భారీన పడే అవకాశం ఉంటుంది కావున పిల్లలు పట్ల కుటుంబసభ్యులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కలుషిత నీరు, దోమల కారణంగా విష జ్వరాలు సోకే ప్రమాదం ఉంది. ఇలా ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైద్య ఆరోగ్యశాఖ అందుకు కావలసిన మందులను సిద్ధం చేసుకుని సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి వైద్య సిబ్బంది సిద్దంగా ఉంది.
వర్షాకాలంలో వాంతులు, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకు సంబంధించిన మందులను ప్రభుత్వం సబ్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో పెట్టింది ప్రభుత్వం. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి ప్రాథమిక చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కలుషిత ఆహారంతో టైఫాయిడ్…
కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వలన టైపాడ్ సోకే ప్రమాదం ఉంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి లాంటి లక్షణాలు టైఫాయిడ్‌లో కనిపిస్తాయి. పరిశుభ్రమైన ఆహారం, వేడి చేసిన నీళ్లు తాగడం, ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవడంతో ఈ వ్యాధికి చెక్ పెట్టవచ్చని మండల వైద్యాధికారి హరికిషన్ తెలిపారు.
విష జ్వరాలు నియంత్రలకు వైద్యుల సూచనలు…
మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి రోగాలు దోమలతో వ్యాప్తి చెందుతాయి. నియంత్రణకు పరిసరాల పరిశుభ్రత, రోడ్లపై గుంతలు, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగకుండా తాగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి నుంచి నీళ్లను వెంట తీసుకెళ్లడం మరీ మంచిది. ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలి
ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలు, చికెన్, జొన్న రొట్టె, రాగి జావా, జొన్న జావా, డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల పండ్లు, పండ్ల రసాలు, తాజా ఆకుకూరలు, పప్పులు, మిరియాల రసం ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు ఎప్పటికప్పుడు తాజాగా ఉండే విధంగా చూసుకుని శుభ్రంగా కడుక్కొని వాడుకోవాలి. మనం తినే కూరల్లో పసుపు వెల్లుల్లి అల్లం లాంటివి విధిగా వాడుకోవాలి.
వాయిస్ బీ డాక్టర్ హరికిషన్, మండల వైద్యాధికారి, కొత్తూరు, రంగారెడ్డి జిల్లా
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, వాంతులు, విరేచనాలు లాంటి రోగాలు సోకే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. సబ్ సెంటర్లు, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విష జ్వరాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి.
ఎమ్మే శ్రీలత సత్యనారాయణ జిల్లా వైద్య,విద్య స్టాండింగ్ కమిటీ మెంబర్, రంగారెడ్డి జిల్లా
రైతులు జాగ్రత్తలు పాటించాలి
వర్షాకాలంలో రైతన్నలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలం గట్లల్లో, చెత్త పొదల్లో, గడ్డివాముల్లో విష సర్పాలు కాచుకొని ఉంటాయి. పొలం పనుల్లో ఉన్నప్పుడు పరిసరాలను గమనిస్తూ పనులు చేసుకోవాలి. తడి చేతులతో విద్యుత్ స్టార్టర్‌ను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టార్టర్ భూమి పై పెట్టకుండా పైకి ఉండేలా పెట్టుకోవాలి. అనుకోకుండా పాము కాటుకు గురైన పక్షంలో నాటువైద్యలను సంప్రదించకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి.
బీ. సాయి కృష్ణ, విద్యుత్ ఏఈ, కొత్తూరు మండలం, రంగారెడ్డి జిల్లా.
వైద్యానికి అధిక నిధులు ఖర్చు
వర్షాకాలం ప్రారంభమైంది. ప్రజలు విష జ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకు ప్రభుత్వం తగిన ప్రణాళికతో ముందుకు వెళుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నారు. పల్లె దవాఖానాల ఏర్పాటుతో ప్రజల వద్దకు వైద్యాన్ని తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని శుభ్రమైన భోజనం తీసుకోవడంతో విష జ్వరాలకు చెక్ పెట్టొచ్చు.
బీ .చిర్రా సాయిలు, సర్పంచ్, మల్లాపూర్, కొత్తూరు రంగారెడ్డి జిల్లా.