ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన కవి దాశరథి

– పదునైన రచనలతో ప్రజల్లో చైతన్యం :  తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి
నవతెలంగాణ-ముషీరాబాద్‌
నిజాం పాలకుల చేతిలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్న ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన కవి దాశరథి అని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతి సభ.. తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి అధ్యక్షతన జరిగింది. ముందుగా దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆనందాచారి మాట్లాడుతూ.. నిజాం పాలనపై అక్షర శరాలు సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్యులు అని తెలిపారు. పాతికేండ్ల వయస్సుకే మహాకవిగా దాశరథి కీర్తి గడించినా.. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వమే ఆయన్ని ఇంతవాణ్ని చేసిందని చెప్పారు. నేడు మణిపూర్‌ రగులుతోంది.. పాలకులు మౌనం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో దాశరథి స్ఫూర్తితో మనమంతా పోరాడాలని సూచించారు. ఈ సభలో టీపీఎస్‌కె బాధ్యులు భూపతి వెంకటేశ్వర్లు, నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.వాసు, మేనేజర్‌ కృష్ణారెడ్డి, తెలంగాణ సాహితి రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్‌కృష్ణ, సలీమ, ప్రభాకరా చారి, ఎం.రేఖ, పేర్ల రాము, రఘు, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

Spread the love