పగలూ, రాత్రి తేడా లేకుండా..సహాయక చర్యలు

Day and night without difference..assistance measures– కేరళలో నిర్విరామంగా 1000 మంది పైగా అధికారుల సేవలు
తిరువనంతపురం : వాయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతం వద్ద పగలు, రాత్రి తేడా లేకుండా 1000 మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు సహాయక చర్యల్లో నిమగమై ఉన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. 24 గంటలూ కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం కల్పేట్ట వద్ద సివిల్‌ స్టేషన్‌, చూర్‌మల వద్ద తాత్కాలిక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రభుత్వ సిబ్బందిని 15 బృందాల కింద విభజించి గాలింపు, సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.
అలాగే సహాయక సామాగ్రి సేకరణ, పంపిణీని నిర్వహిస్తున్నారు. కౌన్సిలింగ్‌, పునరావాస కేంద్రాలు, సాంకేతిక బృందాల నిర్వహణ, చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి, బాధితుల, ఇంకా ఆచూకీ తెలియన వారి సమచారం, వ్యర్థాల తొలగింపు, డేటా నిర్వహణ వంటి ప్రక్రియలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు వెలికితీసిన మృతదేహలకు సంబంధించిన విషయాలను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అంటే మృతదేహాల గుర్తింపు, కుటుంబ సభ్యులకు అప్పగించడం, క్లెయిమ్‌ చేయని మృతదేహాలను దహనం చేయడం, శవపరీక్షలకు సంబంధించిన విషయాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ, రెస్య్కూ కార్యకలాపాలను నిర్వహించే ప్రభుత్వ విభాగాలు రాష్ట్ర ప్రభుత్వానికి రోజువారీ నివేదికలను అందచేస్తున్నట్లు కార్యాలయం తెలిపింది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ఆరో రోజు అయిన ఆదివారం కూడా కొనసాగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహాయక బలగాలతో పాటు 1700 మంది రిజస్టర్డ్‌ వలంటీర్లు 188 గ్రూపులుగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగతిస్తున్నారు. పరంపర, నిలంబూర్‌లో మరో రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. నిలంబూరులో ఏడు శరీర భాగాలు, సూచిపరలో ఒక శరీర భాగం లభించాయి. మెప్పాడి వద్ద గుర్తు తెలియని 8 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటి వరకు లభించిన శరీర భాగాలను, మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్‌ఎ పరీక్షల కోసం రక్తనమూనాల సేకరిస్తున్నారు. వయనాడ్‌ జిల్లాలో 77 సహాయ శిబిరాల్లో ప్రస్తుతం 8246 మంది ఉన్నారు. కాగా కొండచరియులు విరిగిపడిన ప్రమాదంలో 357 మంది చనిపోయివుంటారని అనధికారిక అంచనా. అయితే ఆదివారం నాటికి 219 మంది మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయ్యింది. 135 మృతదేహాలను వారి బంధువులకు అందించారు. 122 శరీర భాగాలును గుర్తించాల్సివుంది.
ట్రక్‌ డ్రైవర్‌ అర్జున్‌ కుటుంబానికి విజయన్‌ పరామర్శ
కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో షిరూర్‌కు సమీపంలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో గల్లంతైన ట్రక్‌ డ్రైవర్‌ అర్జున్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆదివారం హామీ ఇచ్చారు. కోజికోడ్‌లోని కన్నడిక్కల్‌లో అర్జున్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి విజయన్‌ పరామర్శించారు. ప్రస్తుతం వయనాడ్‌లో ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు ఇస్తున్న ప్రాధాన్యతనే ఈ కుటుంబానికి ఇస్తామని తెలిపారు. సహాయక చర్యలు వేగంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని విజయన్‌ హామీ ఇచ్చినట్లు అర్జున్‌ సోదరి అంజూ విలేకరులకు తెలిపారు. గత జులై 16న షిరూర్‌కు సమీపంలో కొండచరియలు విరిగిపడ్డంతో ట్రక్‌ డ్రైవర్‌ అర్జున్‌ ట్రక్‌తో సహా గంగావళి నదిలో గల్లంతైన సంగతి విదితమే.

Spread the love