కాంగ్రెస్‌కు షాక్​… మైనంపల్లి రాకను వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడి రాజీనామా

నవతెలంగాణ-హైదరాబాద్ : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్‌తో పాటు ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్ ను కాంగ్రెస్ అదిష్టానం హామీ ఇచ్చింది. అయితే, మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఇటు మల్కాజ్‌గిరితోపాటు మెదక్‌లోనూ ప్రకంపనలు రేపింది. మైనంపల్లి రోహిత్ చేరికను వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆ పార్టీని వీడారు. ఈ రోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. మైనంపల్లి చేరికను వ్యతిరేకించిన ఆయన పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనలాంటి కార్యకర్తలకు కాంగ్రెస్‌లో స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు, త్యాగాలు, పడ్డ కష్టాలు గుర్తించకుండా కేవలం డబ్బు సంచులే ప్రాతిపదికగా టికెట్లు ఇవ్వడం వేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోయేది ఆయన వెల్లడించలేదు. మరోవైపు మైనంపల్లి రాకతో మల్కాజిగిరి అసెంబ్లీ సీటు ఆశిస్తున్న కాంగ్రెస్‌ నేత నందికంటి శ్రీధర్ కూడా అసంతృప్తిగా ఉన్నారు.

Spread the love