పాలకవర్గంతో ‘డీ’సీసీబీ

'Dhi' CCB with the ruling class– ఖమ్మం సహకార బ్యాంకు సీఈవో, చైర్మెన్‌ ఏకపక్ష ధోరణి
– డైరెక్టర్లతో సంబంధం లేకుండా టెస్కాబ్‌ పేరుతో నిర్ణయాలు
– పాలకవర్గం ఆమోదం లేకుండానే బదిలీలు, ఉద్యోగోన్నతులు
– 13 మందికి ఉద్యోగోన్నతిలో డిగ్రీ కొర్రీపై పాలకవర్గం విమర్శలు
– డిగ్రీ చదివినా మళ్లీ చేస్తేనే ప్రమోషన్‌పై డైరెక్టర్ల వ్యతిరేకత
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలనా వ్యవహారాలు పాలకవర్గం ప్రమేయం లేకుండానే ఏకపక్షంగా సాగుతున్నాయి. చైర్మెన్‌ డి.వెంకటేశ్వర్లు, సీఈవో అబిద్‌ ఉర్‌ రెహ్మాన్‌ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. పాలకవర్గం నిర్ణయాలకు వ్యతిరేకంగా బదిలీలు, ప్రమోషన్లు.. ఇలా ఒకదాని వెంట ఒకటి సాగుతున్నాయి. పాలకవర్గం వ్యతిరేకించినా టెస్కాబ్‌ నిబంధనల పేరుతో అమలు చేస్తున్నారు. మరో ఆరునెలలు మాత్రమే ఈ పాలకవర్గం పదవీకాలం ఉండటంతో సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. పాలకవర్గం డైరెక్టర్లుగా ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఉండటంతో ఇక డీసీసీబీ వ్యవహారాల్లో ముగ్గురు మంత్రుల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పాలకవర్గం ప్రమేయం లేకుండానే బ్యాంకులో నిర్ణయాలు అమలవుతున్నాయి. తమతో సంబంధం లేకుండా బ్యాంకు నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో మెజార్టీ డైరెక్టర్లు సమావేశాలకు దూరంగా ఉండటంతో కోరం లేక మీటింగ్‌లు వాయిదా పడుతున్నాయి.
డీసీసీబీ పాలన అస్తవ్యస్తం..
చైర్మెన్‌ది ఓ దారి.. సీఈవోది మరో దారి.. డైరెక్టర్లది ఇంకోదారిగా ఉండటంతో బ్యాంకు పాలన అస్తవ్యస్తంగా తయారవుతోందనే విమర్శలున్నాయి. కొన్నిరోజులుగా సమావేశాలు, తీర్మానాలు, ఎజెండా ఇవేవీ లేకుండా బ్యాంకు పాలన గాడి తప్పుతోంది. వందేండ్ల చరిత్ర, రూ.3వేల కోట్ల లావాదేవీలున్న ఖమ్మం డీసీసీబీ.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. బ్యాంకు పరిధిలో వంద పీఏసీఎస్‌లు, 176 వ్యవసాయేతర సహకార సంఘాలు, 50 డీసీసీబీ బ్రాంచీలు ఉన్నాయి. పాలకవర్గం మధ్య విభేదాల కారణంగా ఇప్పుడు వీటి నిర్వహణలో రకరకాల లోపాలు తలెత్తుతున్నాయి. సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొనడంతో ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకోవాలనే డిమాండ్‌ ఊపందుకుంటున్నాయి.
టెస్కాబ్‌ పేరు చెప్పి…
టెస్కాబ్‌ నిబంధనల పేరుతో బ్యాంకులో బదిలీలు, ప్రమోషన్లు చేపడుతుండటాన్ని పాలకవర్గం వ్యతిరేకిస్తోంది. 2020కి పూర్వం డిగ్రీలున్నా అవి చెల్లవని, ఆ తర్వాత డిగ్రీ చేసిన వారికి మాత్రమే స్టాఫ్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించడంపై డైరెక్టర్లు సీఈవోను ప్రశ్నించారు. ఎవరైనా ఒక్కసారే డిగ్రీ చేస్తారు కానీ పదే పదే డిగ్రీలు ఎలా చేస్తారని పాలకవర్గం నిలదీసింది. ఎప్పుడో ఉద్యోగంలో జాయినయిన వాళ్లు మళ్లీ డిగ్రీ చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. దేశంలో ఏ సహకార వ్యవస్థలోనూ ఈ రకమైన నిబంధన లేదని, కేవలం తెలంగాణ సహకార రంగంలోనే ఈ రకమైన నిబంధన ఉండటం ఏంటని ప్రశ్నించారు. అయినప్పటికీ టెస్కాబ్‌ ఎండీ దీనిపై సానుకూలంగా లేరని, నిబంధనల ప్రకారమే ఉద్యోగోన్నతులు కల్పిస్తున్నామని సీఈవో డైరెక్టర్లకు వివరించారు.
డైరెక్టర్ల మూడు డిమాండ్లు..
సమావేశాలను కోరం లేకుండా డైరెక్టర్లు బహిష్కరించడానికి ప్రధానంగా మూడు డిమాండ్లు ఉన్నాయి. వీటిలో ఒకటి ఎజెండాలో చైర్మెన్‌ ఎన్నికను పెట్టాలి. రెండోది ఇటీవల జరిగిన బదిలీల్లో హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయకుండా అక్రమంగా ట్రాన్స్‌ఫర్లు చేశారని, దీనివల్ల కొందరికి అన్యాయం జరిగిందని అంటున్నారు. కాబట్టి ఈ బదిలీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక మూడో అంశానికొస్తే కొద్దిరోజుల క్రితం 22 మంది ఖాతాదారులకు రూ.20లక్షలకు పైగా మార్టిగేజ్‌ రుణాలు మంజూరు చేశారు. వాస్తవానికి రూ.10 లక్షలకు పైగా రుణాలు ఇస్తే డీజీఎం అనుమతి తప్పనిసరి. కానీ డీజీఎంను వదిలేసి ఆ లోన్లు మంజూరు చేశారనే సాకుతో మేనేజర్లపై చర్యలు తీసుకునేందుకు పూనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదీ కరెక్టు కాదు.. తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని డీజీఎంపై చర్యలు తీసుకోవడంలో చైర్మెన్‌, సీఈవో వెనుకాడుతున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మూడు అంశాలు తేలకుండా సమావేశాలకు వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈనెల 6వ తేదీన జరిగిన సమావేశాన్ని సైతం బహిష్కరించారు. అంతకుముందు రెండు, మూడు సమావేశాలకు కూడా గైర్హాజరయ్యారు. వీటిలో చైర్మెన్‌, డైరెక్టర్ల ఎన్నికకు సంబంధించిన అంశాన్ని మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని చైర్మెన్‌ తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. డైరెక్టర్ల డిమాండ్లకు సంబంధించిన మినిట్స్‌ కాపీ సైతం ‘నవతెలంగాణ’కు అందడం గమనార్హం.

13 మంది ప్రమోషన్స్‌పై డైరెక్టర్ల వ్యతిరేకత..
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో పనిచేస్తున్న 13 మంది ఆఫీస్‌ సబార్డినేట్లకు తాజాగా స్టాఫ్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వారికి సీఈవో రెహ్మాన్‌ చేతుల మీదుగా మంగళవారం ఉత్తర్వులు అందజేశారు. అయితే దీన్ని పాలకవర్గం వ్యతిరేకించింది. 2020 తర్వాత డిగ్రీ చేసిన వారికి మాత్రమే ప్రమోషన్లు ఇవ్వడాన్ని డైరెక్టర్లు తప్పుబట్టారు. అయినప్పటికీ టెస్కాబ్‌ నిబంధనల పేరుతో ఉద్యోగోన్నతి కల్పించారు.

Spread the love