లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీసీపీ భాస్కర్‌

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీసీపీ భాస్కర్‌నవతెలంగాణ- వేమనపల్లి
మండలంలోని లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్‌ అన్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగి రాచర్ల, ముల్కలపేట మధ్యగల వంతెన తెగిపోవడంతో సోమవారం ఆ ప్రాంతాలను జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్‌ సీఐ సుధాకర్‌, నీల్వాయి ఎస్‌ఐ శ్యామ్‌ పటేల్‌తో కలిసి పరిశీలించారు. రెస్క్యూ టీమ్‌తో స్వయంగా బోటు నడిపి రాచర్ల మధ్య బ్రిడ్జి మునిగిపోయిన ప్రాంతానికి, రహదారి దిగ్బంధం ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి, అక్కడి ప్రజలకు పోలీసుల ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ వర్షం కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయని, వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండి ఉండటం వలన రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అత్యవసరమయితే తప్ప బయటకి రావద్దని తెలిపారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రతి గ్రామం నుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని గురించి సమాచారాన్ని సేకరించి అవసరమైతే అక్కడికి చేరుకొని ప్రజలకు అండగా ఉండాలని తెలిపారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులను, పొంగిపొర్లుతున్న చెరువులను, వాగులను చూడటానికి బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్నవారు డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

Spread the love