ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం

నవతెలంగాణ పెద్దవంగర: మండల పరిధిలోని పోచంపల్లి గ్రామ శివారు ఎస్సారెస్పీ కాలువలో మంగళవారం రాత్రి ఓ యువకుడి మృతదేహం కొట్టుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా, పాలకుర్తి మండలం, వల్మిడి గ్రామానికి చెందిన దండెంపల్లి శివ (31) హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 23 న సద్దుల బతుకమ్మ వేడుకల కోసం మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు పట్టణ కేంద్రంలోని మేనమామ అయిన మంగలపల్లి ఉప్పలయ్య ఇంటికి వచ్చాడు. శివ తన బంధువైన మంగలపల్లి ప్రవీణ్ తో కలిసి ద్విచక్ర వాహనం పై నాంచారి మడూర్ కు వెలుతున్న క్రమంలో మార్గమధ్యంలోని ఎస్సారెస్పీ కాలువలోకి బహిర్భూమికి వెళ్లి గల్లంతయ్యాడు. ప్రవీణ్ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆచూకీ లభించలేదు. గల్లంతైన శివ మృతదేహం మండలంలోని పోచంపల్లి గ్రామ శివారు ఎస్సారెస్పీ కాలువలో లభ్యమైందని ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Spread the love