– ఇదీ వరంగల్‌లోని సత్య ఆస్పత్రి నిర్వాకం
– ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
నవతెలంగాణ – మట్టెవాడ
వరంగల్‌లోని సత్య ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. మోకాలు శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం ఆపరేషన్ థియేటర్‌కు నవ్వుకుంటూ వెళ్లిన రోగి జీవం లేకుండా దేహం తిరిగి రావడంతో రోగి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. షుగరు, బీపీ లాంటి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వ్యక్తిని తీసుకెళ్లి చంపి చనిపోయిన దేహాన్ని అప్పగించడంతో భగ్గుమన్న బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్, మిల్స్ కాలనీల సీఐలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పేందుకు యత్నించారు. ఈక్రమంలో పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగి తమకు న్యాయం చేయాలని ఆస్పత్రిలో బైటాయించారు. ఈ ఘటనం ఆదివారం చోటుచేసుకుంది. మృతుని భార్య అరుణ, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్‌లోని శివనగర్ ప్రాంతానికి చెందిన సిలుసాని మధుకర్(45) ప్లంబర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత గురువారం శివనగర్‌లోని ఒక ఇంటి వద్ద ప్లంబర్ పని చేస్తున్న క్రమంలో వర్షం కారణంగా నేల తడిసిపోవడంతో కాలు జారి కిందపడగా మోకాలుకు బలమైన గాయమయింది. దాంతో అదే రోజు బంధువులు సత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది అన్ని పరీక్షలు నిర్వహించి మోకాలు చిప్ప ఆపరేషన్ చేయాలని ఆరోగ్యశ్రీ కింద చేర్పించుకున్నారు. ఆదివారం శస్త్ర చికిత్స నిర్వహిస్తామని చెప్పి గుండె పరీక్ష కోసం హన్మకొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి శుక్రవారం తరలించారు. అన్ని చక్కగా ఉండటంతో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్‌లోకి మధుకర్‌తోపాటు మరో ముగ్గురు పేషంట్లను తీసుకెళ్లారు. ఆ ముగ్గురు ఆపరేషన్ చేసుకొని బయటకి వచ్చినప్పటికీ.. మధుకర్ 3 గంటలు గడిచినా బయటకి రాలేదు. దాంతో బంధువుల్లో ఆందోళన నెలకొన్నది. వైద్యులను ప్రశ్నించగా.. ఇంకా ఆపరేషన్ చేయలేదని ఒకసారి, సీరియస్‌గా ఉందని మరొకసారి.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. అంతేకాక, వైద్యులు, సిబ్బంది, కిందికి పైకి తిరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చిన బంధువులు వారిని నిలదీయగా.. స్వీపర్‌తో రోగి భార్యను లోపలికి పిలిపించుకున్నారు. ఆస్పత్రి యాజమాన్యం శస్త్ర చికిత్స చేస్తున్న క్రమంలో రోగికి గుండెపోటు వచ్చి చనిపోయాడని చావు కబురు చల్లగా చెప్పారు. దాంతో ఆగ్రహించిన బంధువులు ఆందోళనకు దిగారు. పెద్ద దిక్కును కోల్పోయిన తన కుటుంబాన్ని ఆదుకునేది ఎవరని, ఇంకా ఎదగని ఇద్దరి కుమారుల భవిష్యత్తు ఎవరు చూస్తారని భార్య కన్నీటి పర్యంతమైంది. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని మృతుని బంధువులకు సర్ది చెప్పాలని చూసినా భీష్మించుకు కూర్చున్నారు. కాగా, ఈ విషయమై ఆస్పత్రి యజమాని బొచ్చు రాధాకృష్ణను వివరాలు కోరేందుకు ఫోన్ చేసినా స్పందించకపోవడం కొసమెరుపు.