గురుకుల విద్యార్థుల మృతి ఆందోళనకరం

Death of gurukula students is worrying– ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌
– అనిరుధ్‌ కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ – ఎల్లారెడ్డిపేట
రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులు మృతి చెందడం ఆందోళనకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థి అనిరుధ్‌ మృతి చెందిన విషయం విదితమే. అతని కుటుంబాన్ని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్‌ గ్రామంలో సోమవారం సిరిసిల్ల ఎమెల్యే కేటీఆర్‌ పరామర్శించారు. పార్టీ నుంచి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కొంతకాలంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆలనా పాలనలో నిరలక్ష్యం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది నెలల కాలంలో 36 మంది విద్యార్థులు మృతి చెందారని చెప్పారు. ఆత్మహత్యలు, పాముకాటుకు గురై విద్యార్థులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్రంలోని హాస్టళ్లలో కల్తీ, నాణ్యత లేని ఆహారం వల్ల 5వేల మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారని వాపోయారు. వివిధ కారణాలతో మృతి చెందిన 36మంది పేద విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మిగతా విద్యార్థుల తల్ిదండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ కమిటీ ద్వారా పాఠశాలల వసతుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.

Spread the love