తమిళనాడులో 40కి పెరిగిన కల్తీ సారా మృతులు

నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో కల్తీ సారా మరణాలు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రంలో పరిస్థితులు పెను విషాదంగా మారాయి. కళ్లకురిచి జిల్లాలో ఇప్పటివరకు కల్తీ సారా తాగి చనిపోయిన వారి సంఖ్య 40కి పెరిగింది. ఇంకా 100 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం గురువారం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ సమస్యను పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి బి గోకుల్‌దాస్ నేతృత్వంలో ఏకైక కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 50 చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు స్టాలిన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీకి మిథనాల్‌ను సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై బాధిత కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చారు. ఆయా కుటుంబాలకు పార్టీ తరపున రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు.

Spread the love